Begin typing your search above and press return to search.

చడీచప్పుడు లేని ఆ బీజేపీ నేత.. పంచుడులో బిజీబిజీ!

దీంతో రఘునందన్ ముందుగానే అప్రమత్తమయ్యారు. ప్రజలకు గొడుగులు, చీరలు పంచుడు మొదలుపెట్టారు. ఇదే సమయంలో మరో జాతీయ పార్టీ సర్పంచులను దువ్వుడం మొదలుపెట్టింది

By:  Tupaki Desk   |   2 Oct 2023 10:38 AM GMT
చడీచప్పుడు లేని ఆ బీజేపీ నేత.. పంచుడులో బిజీబిజీ!
X

తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరుగాంచిన ఆయన కొంతకాలంగా చడీచప్పుడు లేకుండా ఉన్నారు. జర్నలిజం నేపథ్యం నుంచి న్యాయవాదిగా ఆపై నాయకుడిగా మారిన ఆయన మూడు నెలల కిందట చేసిన సొంత పార్టీ నాయకత్వంపై చేసిన విమర్శలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. వాటిని మీడియా ముఖంగానే మాట్లాడిన ఆపై ఖండించారు. అప్పటికే ఆయన చెప్పాలనుకున్నది చెప్పేసినట్లయింది. అయితే, ఎన్నికల ముంగిట మాత్రం ఆయన అనూహ్యంగా మౌనంగా ఉన్నారు. ఇంతకూ ఏంచేస్తున్నారా? అని చూస్తే.. నియోజకవర్గంలో ప్రజలకు గిఫ్టులు ఇస్తూ ఆకట్టుకునే పనిలో ఉన్నారు.

తెలంగాణలో పూర్తిస్థాయి గ్రామీణ నియోజకవర్గం దుబ్బాక. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణంతో 2020లో ఉపఎన్నిక అనివార్యమైంది. అప్పటికే పలుసార్లు ఓటమిపాలైన సానుభూతితో పాటు నాయకత్వ లక్షణాలనూ చూపిన బీజేపీ అభ్యర్థి రఘునందనరావు ఆ సమయంలో దుబ్బాక ప్రజలకు సరైన చాయిస్ గా కనిపించారు. దీంతో ఆయన ఎన్నిక సులభమైంది. కాగా, జర్నలిజంతో పాటు న్యాయవాదిగా మంచి సబ్జెక్ట్ ఉన్న రఘనందన్ బీజేపీ తరఫున బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేవారు. ఆయన మాటతీరు ప్రజలకు సూటిగా అర్థమయ్యే పరిస్థితుల్లో బీజేపీకి మంచి మైలేజీ వచ్చింది. ఇదే ఒకరకంగా ఆయన గెలుపునకు పునాది కూడా అయింది.

రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసి..

బీజేపీ మూడు నెలల కింద తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను తప్పించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పగ్గాలు ఇచ్చింది. ఎన్నికల ముంగిట ఇలా చేయడం అన్ని వర్గాలను ఆశ్చర్యపరిచింది. అందులోనూ తనదైన దూకుడుతో బీజేపీకి తెలంగాణలో మైలేజీ తెచ్చిన సంజయ్ ను తప్పించడం వెనుక రకరకాల కారణాలు వినిపించాయి. కాగా, అదే సమయంలో అంటే సంజయ్ ను తప్పిస్తారన్న కథనాలు వస్తుండగా ఢిల్లీలో కిషన్ రెడ్డి నివాసంలో రఘునందన్ మీడియా మిత్రులతో చిట్ చాట్ గా మాట్లాడారు. సంజయ్ పై వ్యక్తిగతంగా, పార్టీ పరంగా తీవ్ర విమర్శలు చేశారు. ఇవి మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. ఆ తర్వాత సంజయ్ పదవి కోల్పోవడం వేరే విషయం. ఈ పరిణామంత తర్వాత రఘునందన్ పెద్దగా కనిపించడం లేదు.

అప్పుడే తాయిలాలు షురూ..

దుబ్బాకలో ఈసారి రఘునందన్ కు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ తరఫున మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి బరిలో దిగుతారని భావిస్తున్నారు. దీంతో రఘునందన్ ముందుగానే అప్రమత్తమయ్యారు. ప్రజలకు గొడుగులు, చీరలు పంచుడు మొదలుపెట్టారు. ఇదే సమయంలో మరో జాతీయ పార్టీ సర్పంచులను దువ్వుడం మొదలుపెట్టింది. వారితో పాటు మండల అధ్యక్షులకు కార్లు ఇచ్చింది. రూ.50 వేలు నెల జీతం ఇస్తోంది. దీంతో బీజేపీ నేరుగా ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తోంది. ఇంటింటికీ కాషాయ రంగు గొడుగులు, చీరలు అందిస్తోంది. వీటిపై రఘునందన్ ఫొటో ఉండడం గమనార్హం.