కొన్ని కోరికలు తీరవు.. అసెంబ్లీలో రఘురామ మాట విన్నారా?
ఆసక్తికర వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘరామ క్రిష్ణరాజు.
By: Tupaki Desk | 4 March 2025 10:25 AM ISTఆసక్తికర వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘరామ క్రిష్ణరాజు. అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని కూటమి సొంతం చేసుకున్న సందర్భంగా చాలామంది మాట్లాడుకున్న ఒక అంశం.. ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామ క్రష్ణరాజుకు ఎలాంటి పదవిని అప్పగిస్తారు? అని. కొందరు మంత్రి అనుకుంటే.. మరికొందరు స్పీకర్ అన్న వాదనను వినిపించారు. మొత్తంగా.. ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవిని అప్పగించారు చంద్రబాబు.
ఆయన సభాధ్యక్ష స్థానంలో ఉన్న సందర్భంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలో ఉంటే ఎలా ఉంటుందన్నది అందరికి ఎంతో ఆసక్తి కలిగించిన అంశం. అదే విషయాన్ని రఘురామ కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు. అయితే.. ఆయన కోరుకున్నట్లుగా జరగని పరిస్థితి. ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే సభకు హాజరు కామన్న వాదనను తెర మీదకు తీసుకురావటం.. తర్వాత జరుగుతున్న పరిణామాలు తెలిసిందే.
ఈ మధ్యనే అసెంబ్లీకి హాజరైన ఆయన కేవలం పదకొండు నిమిషాలు మాత్రమే ఉండటం.. దీనిపై భారీ చర్చ జరిగింది. అయితే.. తాను కోరుకున్నట్లుగా సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడటం ద్వారా తన కోరిక తీరినట్లుగా రఘురామ పేర్కొన్నారు. తాజాగా బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఏపీ అసెంబ్లీలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్య వచ్చింది. వైసీపీ సభ్యులు సభకు హాజరు కావటం లేదని.. వారు హాజరవ్వాలని తాను కోరుకున్నట్లుగా పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో తననుచావు వరకు తీసుకెళ్లారన్న ఆయన.. అసెంబ్లీకి వైసీపీ సభ్యులురావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పీకర్ స్థానంలో కూర్చున్న డిప్యూటీ స్పీకర్ రఘురామ స్పందించారు. ‘కొన్ని కోరికలు తీరవు’ అంటూ తన మనసులోని మాటను చెప్పేశారు. మొత్తంగా తాను సభాధ్యక్ష స్థానంలో ఉన్న వేళలో వైసీపీ అధినేత.. సభ్యులు అసెంబ్లీకి హాజరవ్వాలని తానెంత బలంగా అనుకుంటున్న విషయాన్ని రఘురామ మరోసారి చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
ఇదిలా ఉండగా.. బడ్జెట్ పై చర్చ సందర్భంగా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఇంగ్లిషులోప్రసంగించారు. దీంతో డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘురామ స్పందించారు. తెలుగులో మాట్లాడితే బాగుంటుందన్న ఆయన.. ‘ఇదే విషయాన్ని కొందరు సభ్యులు సూచిస్తున్నారు. మీ నియోజకవర్గంలోని ప్రజలకు కూడా స్పష్టంగా తెలుస్తుంది. సౌకర్యవంతంగా లేకపోతే మీ ఇష్టం’ అని పేర్కొన్నారు.