Begin typing your search above and press return to search.

మిగిలిన ఐదుగురు ఎవరు? పోలీసులతో గొడవపడే ధైర్యం ఎక్కడిది?

కేసులో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న గుడివాడ టీడీపీ నేత కామేపల్లి తులసిబాబును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు పలు ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబడుతున్నట్లు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   28 Jan 2025 7:06 AM GMT
మిగిలిన ఐదుగురు ఎవరు? పోలీసులతో గొడవపడే ధైర్యం ఎక్కడిది?
X

డిప్యూటీ స్పీకర్ రఘురామ క్రిష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు కామేపల్లి తులసిబాబును ఒంగోలు ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసులు విచారిస్తున్నారు. ఒక సామాన్యుడైన తులసిబాబు సీఐడీ డీజీని ఎలా కలిసేవారని, ఆయన హోదా ఏంటని పోలీసులు తెలుసుకుంటున్నారు. అదే సమయంలో పోలీసు విచారణకు రమ్మంటే ఎస్పీ కార్యాలయం ముందు గొడవ పడేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసులో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న గుడివాడ టీడీపీ నేత కామేపల్లి తులసిబాబును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు పలు ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబడుతున్నట్లు చెబుతున్నారు. రఘురామ గుండెలపై కూర్చొని ఎందుకు కొట్టావు? అలా కొట్టే సమయంలో వీడియో ఎందుకు తీయించావు? ఆ వీడియోను ఎవరికి చూపించావు? వంటి విషయాలను పోలీసులు అడిగినట్లు సమాచారం. అదేవిధంగా రఘురామను కొట్టాల్సిన అవసరం ఏంటి? రఘురామ కేసులో ఇన్ వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చిందనే విషయాలపైనా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి. ఆయనను కలవాలంటే ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా నేరుగా ఎలా కలిసేవాడివి? దాడి చేసిన సమయంలో రఘురామ గదిలో ఉన్న ఐదుగురు ఎవరు? ముసుగులు వేసుకుని దాడి చేసిన వారి పేర్లు ఏంటి? ఎవరెవరు ఆ గదిలోకి వచ్చి వెళ్లారు? ఎన్నిసార్లు తలుపులు మూసి తెరిచారు? వంటి విషయాలను కూపీ లాగినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు నాకు తెలియదు? సంబంధం లేదన్న మాటే తులసిబాబు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాగా, వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ చీఫ్ గా పనిచేసిన పీవీ సునీల్ కుమార్ కు కామేపల్లి తులసిబాబు ప్రధాన అనుచరుడిగా పోలీసులు చెబుతున్నారు. ఆయన ప్రోద్బలంతోనే 2021 మే 14న సీఐడీ కస్టడీలో ఉన్న తనపై తులసిబాబు దాడిచేశాడని, గుండెలపై కూర్చొని పిడిగుద్దులు బాది అంతమొందించేందుకు ప్రయత్నించాడని డిప్యూటీ స్పీకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ నెల 8న తులసిబాబును పోలీసులు విచారించారు. అయితే పోలీసు విచారణకు సహకరించలేదన్న కారణంతో అరెస్టు చేసి జుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇక నిందితుడిని పోలీసు కస్టడీకి అప్పగించాలని విచారణాధికారి కోర్టులో పిటీషన్ వేయగా, 27వ తేదీ మధ్యాహ్నం నుంచి 29వ తేదీ మధ్యాహ్నం వరకు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో గుంటూరు నుంచి ఒంగోలుకు తీసుకువచ్చి ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసులు విచారిస్తున్నారు.

మరోవైపు ఈ నెల 8న పోలీసు విచారణకు వచ్చిన తులసిబాబు ఒంగోలు ఎస్పీ కార్యాలయం ఎదుట పోలీసులతో గొడవ పడటాన్ని ఎస్పీ సీరియస్ గా తీసుకున్నారని అంటున్నారు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి పోలీసులపై తిరుగుబాటు చేసేటంతటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా తులసిబాబు స్వగ్రామంలో కొందరికి అగ్రిగోల్డ్ డబ్బు చెల్లించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ విషయంపైనా నిందితుడిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

తనపై కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు సరిగా వ్యవహరించడం లేదని డిప్యూటీ స్పీకర్ రఘురామ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసులో ప్రధాన నిందితులైన ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయకపోవడం, ముసుగు వ్యక్తులను గుర్తించే పనిని నెమ్మదిగా చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో రిటైర్డ్ ఎఎస్పీ విజయపాల్, టీడీపీ నేత కామిపల్లి తులసిబాబును పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. మరో నిందితురాలు గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆమె ఇంటికి నాలుగుసార్లు నోటీసులు అంటించారు. ఆమె ఆచూకీ కోసం జల్లెడ పడుతున్నారు.