Begin typing your search above and press return to search.

సక్సెస్ స్టోరీ... ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ట్రిపుల్ ఆర్!

ఈ సందర్భంగా పార్టీ ఏదైనా నరసాపురం లోక్ సభ టిక్కెట్ తనదే అని ట్రిపుల్ ఆర్ ధీమాగా చెప్పారు.

By:  Tupaki Desk   |   13 Nov 2024 5:40 AM GMT
సక్సెస్  స్టోరీ... ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్  గా ట్రిపుల్  ఆర్!
X

ఏపీ రాజకీయాల్లో.. ప్రధానంగా 2019-24 సమయంలో అత్యంత హాట్ టాపిక్ గా మారిన పేరు రఘురామ కృష్ణంరాజు (ఆర్.ఆర్.ఆర్.) అని చెప్పుకున్నా అతిశయోక్తి కాదేమో. వైసీపీ తరుపున నరసాపురం లోక్ సభ స్థానం నుంచి గెలిచిన ఆయన... ప్రభుత్వం చేస్తోన్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ప్రశ్నించడం మొదలుపెట్టారు. అక్కడ మొదలైంది అసలు కథ!

అవును... విధేయతకూ, బానిసత్వానికీ మధ్య ఉన్న తేడా తనకు తెలుసని.. అది తెలియకుండా నడుచుకోవాలని జగన్ భావిస్తున్నారన్నట్లుగా కామెంట్ చేసిన రఘురామ కృష్ణంరాజు... నాడు నిజంగా విపక్షాలు స్థబ్ధగా మారిన సమయంలో.. స్వపక్షంలో విపక్షం పాత్రను తీవ్రంగా పోషించారనే చెప్పాలి! "రచ్చబండ" అంటూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై విరుచుకుపడేవారు.

ఫలితంగా... అప్పటి ఏపీ ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురయ్యారు! ఇందులో భాగంగా... కేసులు, ట్రీట్ మెంట్లు, సొంత నియోజకవర్గానికి రాలేని పరిస్థితులు, స్టేషన్ లో పెట్టి గట్టిగా కొట్టించారనే ఆరోపణలు.. వెరసి రఘురామ.. గత ప్రభుత్వంతో తానే రాజు, తానే సైన్యం అయ్యి పెద్ద యుద్ధమే చేశారని చెప్పొచ్చు.

కట్ చేస్తే... 2024 సార్వత్రిక ఎన్నికల సమయం వచ్చేసింది. ఈ సందర్భంగా పార్టీ ఏదైనా నరసాపురం లోక్ సభ టిక్కెట్ తనదే అని ట్రిపుల్ ఆర్ ధీమాగా చెప్పారు. అయితే... నాయకుడు ఒకటి తలిస్తే అధినాయకులు మరొకటి తలచారన్నట్లుగా ఆ టిక్కెట్ ఏ పార్టీ నుంచీ దక్కపోయినా.. టీడీపీ నుంచి ఉండి ఎమ్మెల్యే టిక్కెట్ దక్కింది.

ఈ సమయంలో వైసీపీ అభ్యర్థిపై 56,777 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సమయంలో ఆయనకు మంత్రి పదవి కన్ ఫాం అని ఒకరంటే.. స్పీకర్ పదవి సూటవుతుందని మరొకరు అనారు.. కాదు కాదు హోంమంత్రి అయితే యాప్ట్ గా ఉంటుందని ఒకరంటే.. టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవి గ్యారెంటీ అని ఇంకొకరు భావించారు!

రకరకాల ఈక్వేషన్స్ లో భాగంగా అవేవీ దక్కకపోయినా తాజాగా ట్రిపుల్ ఆర్ కు గుడ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... రఘురామకృష్ణంరాజు పేరును ఉపసభాపతిగా సీఎం చంద్రబాబు ఖరారు చేశారు! ఈ పదవికి ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో.. ఎన్నిక లాంఛనమే అని అంటున్నారు.

ఏది ఏమైనా.. గత ప్రభుత్వ హయాంలో రాజద్రోహం కేసులు ఎదుర్కొని, సొంత నియోజకవర్గానికి రావడానికి కూడా అవకాశాలు లేక, హస్తినకే పరిమితమైన రఘురామ.. నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉప సభాపతిగా ఎన్నికకాబోతుండటం కచ్చితంగా సక్సెస్ స్టోరీనే అని అంటున్నారు పరిశీలకులు.