Begin typing your search above and press return to search.

మా కష్టం రెండున్నరేళ్లే...రఘురామ సంచలన వ్యాఖ్యలు!

ఆయన మరోసారి ఎంపీగా నరసాపురం నుంచి గెలవాలని అనుకున్నారు.

By:  Tupaki Desk   |   10 Nov 2024 3:41 AM GMT
మా కష్టం రెండున్నరేళ్లే...రఘురామ సంచలన వ్యాఖ్యలు!
X

వైసీపీలో నాలుగున్నరేళ్ల పాటు నరసాపురం పార్లమెంట్ నుంచి రెబెల్ ఎంపీగా ఉంటూ వచ్చిన వారు రఘురామ క్రిష్ణం రాజు అలియాస్ ట్రిపుల్ ఆర్. ఆయన ఆ విధంగా ఏపీలో ఒక బిగ్ ఫిగర్ గా అప్పట్లో వెలిగారు. ఆయన మరోసారి ఎంపీగా నరసాపురం నుంచి గెలవాలని అనుకున్నారు. అయితే ఆయనకు ఎంపీ టికెట్ పొత్తులో దక్కలేదు.

దాంతో ఆయన టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రి కావాలని కూడా ఆరాటపడ్డారు అంటారు. కానీ అది కూడా దక్కలేదు. అదే సమయంలో స్పీకర్ గా ఆయన ఉండాలని భావించారు అంటారు. కానీ స్పీకర్ పదవి కూడా ఆయనకు లభించలేదు.

మొత్తానికి రఘురామ క్రిష్ణం రాజు జస్ట్ ఎమ్మెల్యేగానే ఉన్నారు. అయితే అధికార పార్టీలో ఉన్నామన్న తృప్తి అయితే ఆయనకు ఉంది. ఇదిలా ఉంటే దేశంలో జమిలి ఎన్నికలకు తెర లేస్తోంది. అవి జరుగుతాయా జరగవా జరిగితే ఎవరికి లాభం ఏమిటి అన్న చర్చలు సాగుతున్నాయి.

ఈ నేపధ్యంలో రఘురామ క్రిష్ణం రాజు ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జమిలి ఎన్నికల మీద తనదైన శైలిలో విశ్లేషణ చేశారు. దేశంలో జమిలి ఎన్నికలు కచ్చితంగా వస్తాయని అన్నారు. బీజేపీలో తనకు ఉన్న మిత్రుల ద్వారా తెలిసింది ఏంటి అంటే జమిలి ఎన్నికల విషయంలో బీజేపీ పట్టుదలతో ఉందని అని చెప్పారు.

వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నది బీజేపీ నినాదం అని ఆయన అన్నారు. ఇక జమిలి ఎన్నికలు పెడితే పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావచ్చు అన్నది ఇండియా కూటమి పెద్దలలో సైతం ఒక నమ్మకం ఒక ఆలోచన ఏ మూలనో ఉండడం చేత కావచ్చునని ఆయన అన్నారు. అందుచేత కాంగ్రెస్ కూడా జమిలి ఎన్నికలకు పెద్దగా అభ్యంతరం పెట్టే చాన్స్ లేదని అనిపిస్తోందని చెప్పారు.

జమిలి ఎన్నికల విషయంలో తన పార్టీ టీడీపీ అభిప్రాయం ఏమిటి అన్నది తనకు తెలియదని అయితే ఎన్డీయే మిత్రుడిగా టీడీపీ బీజేపీ ఆలోచనలనే బలపరచవచ్చునని ఆయన అన్నారు. మొత్తం మీద చూసుకుంటే కనుక 2027 మొదట్లో అంటే ఫిబ్రవరిలో దేశంలో జమిలి ఎన్నికలు జరగవచ్చు అన్నది రఘురామ అభిప్రాయంగా చెప్పారు.

దాంతో తాము ఏపీలో పడిన కష్టం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా కేవలం రెండున్నరేళ్లకు మాత్రమే పరిమితం అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి అయిదేళ్ళ కాల పరిమితి తో నెగ్గిన ఏపీ ప్రభుత్వం రెండున్నరేళ్ళకే పరిమితం అవుతోందని ఆయన అన్నారు.

మరో వైపు చూస్తే జమిలి ఎన్నికలు 2027లో జరుగుతాయి అనుకుంటే 2026లోనే కొత్తగా లోక్ సభ సీట్లను పెంచడం అలాగే అసెంబ్లీ సీట్లను పెంచడం చేస్తూ పునర్ విభజన కూడా జరుపుతారని అన్నారు. ఆ విధంగా చూస్తే ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు కస్తా 225 సీట్లకు పెరుగుతాయని ఆయన అంచనా వేస్తున్నారు.

మొత్తం మీద రఘురామ చెప్పిన విషయాలు వేసిన అంచనాలు చూస్తే కనుక జమిలి ఎన్నికలు రావడం ఖాయమని అర్ధం అవుతోంది. అదే విధంగా టీడీపీ కూటమి అధికారాలు కూడా సగానికి సగం తగ్గిపోతున్నాయని కూడా ఆయన చెప్పడమూ విశేషంగా చూడాలి. అంటే ఎంతో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచిన టీడీపీ కూటమి పూర్తి కాలం అధికారంలో ఉండటం లేదు అన్నది కూడా అర్థం అవుతోంది.