Begin typing your search above and press return to search.

ట్రిపుల్ ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసు... నాటి సీఐడీ అడిషనల్ ఎస్పీకి షాక్!

వివరాళ్లోకి వెళ్తే... తనను అరెస్ట్ చేసి జైల్లో టార్చర్ పెట్టారంటూ రఘురామ కృష్ణంరాజు గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

By:  Tupaki Desk   |   9 Aug 2024 1:36 PM GMT
ట్రిపుల్  ఆర్  కస్టోడియల్  టార్చర్  కేసు... నాటి సీఐడీ అడిషనల్  ఎస్పీకి షాక్!
X

ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ని గత ప్రభుత్వ హయాంలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తనను చిత్రహింసలకు గురిచేశారని.. తనను విపరీతంగా టార్చర్ చేశారంటూ రఘురామ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... సీఐడీ అడిషనల్ ఎస్పీకి చుక్కెదురైంది.

అవును... ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ కు చుక్కెదురైంది. ఇందులో భాగంగా.. ఆయనకు మధ్యంతరం బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో... ఈ కేసులో ఇంకా ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేది ఆసక్తిగా మారింది. ఈ వ్యవహారంలో వైఎస్ జగన్ పై కూడా కేసు నమోదైన సంగతి తెలిసిందే.

వివరాళ్లోకి వెళ్తే... తనను అరెస్ట్ చేసి జైల్లో టార్చర్ పెట్టారంటూ రఘురామ కృష్ణంరాజు గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో... మాజీ సీఎం జగన్, అప్పటి సీఐడీ డీజీ పీవీ సునీల్ కుమార్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీ.ఎస్.ఆర్. ఆంజనేయులు, సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ తదితరులపై కేసు నమోదు చేశారు. దీంతో విజయ్ పాల్ హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో ఆయన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు తరుపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా... రఘురామకు కస్టోడియల్ టార్చర్ లో గాయాలు అయినట్లు గతంలో సుప్రీంకోర్టు అభిప్రాయపడిందని తెలిపారు! ఈ సందర్భంగా... సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ కు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరారు.

మరోవైపు పిటిషనర్ తరుపున జీవీఎస్ కిశోర్ కుమార్ వాదనలు వినిపించారు. నిబంధనల ప్రకారమే రఘురామ కృష్ణంరాజుని విచారించామని, కస్టోడియల్ టార్చర్ జరగలేదని అన్నారు. పిటిషనర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇలా ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు.. రఘురామ తరుపు లాయర్ వాదనను పరిగణలోకి తీసుకుని మద్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

కాగా... 2021 మే నెలలో తనపై రాజద్రోహం కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు ఆయనను హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే! అయితే నాడు రాత్రంతా కస్టడీలో నిర్భంధించి టార్చర్ పెట్టారని, హతమార్చేందుకు యత్నించారని రఘురామ ఇటీవల నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్, సునీల్ కుమార్, ఆంజనేయులు, విజయ్ పౌల్ తదితరులపై కేసు నమోదు చేశారు.