Begin typing your search above and press return to search.

ప్రత్యేక రోజుల్లోనే టార్గెట్‌ చేస్తారు: ఆర్‌ఆర్‌ఆర్‌ సంచలన వ్యాఖ్యలు!

మరో మూడు నాలుగు రోజులపాటు జైలులోనే ఉంటే తనను కచ్చితంగా హత్య చేసి ఉండేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   12 Sep 2023 4:00 AM GMT
ప్రత్యేక రోజుల్లోనే టార్గెట్‌ చేస్తారు: ఆర్‌ఆర్‌ఆర్‌ సంచలన వ్యాఖ్యలు!
X

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రాణ హాని పొంచి ఉందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు హాట్‌ కామెంట్స్‌ చేశారు. గతంలో మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో సాక్ష్యాలు రూపుమాపేందుకు జైలులోనే పలువురిని హత్య చేశారని ఆయన గుర్తు చేశారు. తనను కూడా గుంటూరు జైలులో హత్య చేయాలని పథక రచన చేశారని ఆరోపించారు. అయితే శ్రీ వేంకటేశ్వర స్వామి దయ, సుప్రీంకోర్టు తీర్పుతో బతికి బయటపడ్డానని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తాను ఒక్కరోజులోనే జైలు నుంచి బయటకొచ్చేశానని వెల్లడించారు. మరో మూడు నాలుగు రోజులపాటు జైలులోనే ఉంటే తనను కచ్చితంగా హత్య చేసి ఉండేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

'హత్య చేయడానికి ఒక ట్యాబ్లెట్‌ ను తెప్పించారు. అది తీసుకుంటే వెంటనే చనిపోరు. కానీ 10 నుంచి 15 రోజుల తర్వాత గుండెపోటుతో చనిపోయే ప్రమాదం ఉంది' అని రఘురామ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

అలాగే ప్రత్యేక రోజుల్లోనే అరెస్టు చేస్తారని రఘురామ ఆరోపించారు. తనను తన పుట్టిన రోజున అరెస్టు చేశారని.. అలాగే చంద్రబాబును ఆయన పెళ్లి రోజున అరెస్టు చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. ఈ నేపథ్యంలోనే మిగిలిన టీడీపీ నేతలు తమ ప్రత్యేక రోజుల్లో విదేశాలకు వెళ్లిపోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని చెప్పారు.

చంద్రబాబుపై మోపిన కేసులో పస లేదని.. కేవలం నస, కసి మాత్రమే ఉన్నాయని ర«ఘురామ తెలిపారు. చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇవ్వక ముందే ఆ నగరంలో 144 సెక్షన్‌ విధించడం, రహదారిని క్లియర్‌ చేయడం వంటి ఘటనలు పరిశీలిస్తే తీర్పు ఏమిటో ప్రభుత్వానికి ముందే తెలుసని తెలుస్తోందని హాట్‌ కామెంట్స్‌ చేశారు. నైపుణ్య శిక్షణ కోసం గత ప్రభుత్వం కేవలం రూ.370 కోట్లు మాత్రమే విడుదల చేస్తే అందులో రూ.550 కోట్ల అక్రమాలు జరిగాయని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు.

విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి సీమెన్స్‌ సంస్థతో గత ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుందని, శిక్షణకు అయ్యే ఖర్చులో కేవలం 10 శాతం నిధులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని రఘురామ గుర్తు చేశారు. 2.63 లక్షల మంది విద్యార్థులు నైపుణ్య శిక్షణ పొందారని, వారిలో 80 శాతం మంది విద్యార్థులకు ఆ శిక్షణ ద్వారా ఉద్యోగాలు లభించాయన్నారు.

సీమెన్స్‌ సంస్థతో గత ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకునే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్న అజేయ కల్లం ఆర్థిక శాఖ వ్యవహారాలను సైతం పర్యవేక్షించారని రఘురామ గుర్తు చేశారు. అలాగే నైపుణ్య శిక్షణ కార్యకలాపాలను కార్యదర్శి హోదాలో ప్రేమచంద్రా రెడ్డి నిర్వహించారని తెలిపారు. అందులో ఒకవేళ అవినీతి చోటుచేసుకుంటే ముందు అజేయ కల్లం, ప్రేమచంద్రారెడ్డిలను అరెస్టు చేయాల్సి ఉందన్నారు.

సిట్‌ అధికారిగా వ్యవహరిస్తున్న రఘురామిరెడ్డి జిహాదీ బ్యాచ్‌ లా వ్యవహరిస్తున్నారని రఘురామకృష్ణరాజు నిప్పులు చెరిగారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తుండడంతో బాధతో అనేక మంది అర్ధాంతరంగా మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. అవన్నీ జగన్‌ ప్రభుత్వం చేసిన హత్యలుగానే భావించాల్సి ఉంటుందన్నారు.

చంద్రబాబుపై మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉందని రఘురామ అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ తోపాటు టీడీపీ సీనియర్లంతా తమ పైనున్న కేసుల్లో ముందస్తు బెయిలుకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. త్వరలోనే నారా లోకేశ్‌ను అరెస్టు చేస్తామని మాజీ మంత్రులతో పాటు, ప్రస్తుత మంత్రులు, ఎమ్మెల్యేలు హెచ్చరికలు జారీ చేస్తున్నారని గుర్తు చేశారు.

చంద్రబాబు హౌస్‌ అరెస్టుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. అలాగే హైకోర్టులో న్యాయం జరుగుతుందని కూడా తాను భావించడం లేదని చెప్పారు. చంద్రబాబు న్యాయవాద బృందం వీలైనంత త్వరగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయడం ఖాయం అని రఘురామరాజు అభిప్రాయపడ్డారు.