Begin typing your search above and press return to search.

రెబల్‌ ఎంపీ పోటీకి మూడు పార్టీలు సిద్ధం!

కాగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని రఘురామకృష్ణరాజు కోరుకుంటున్నారు

By:  Tupaki Desk   |   28 Aug 2023 4:39 AM GMT
రెబల్‌ ఎంపీ పోటీకి మూడు పార్టీలు సిద్ధం!
X

వైసీపీ అధిష్టానంపై నిత్యం విమర్శలు చేస్తున్నారు.. ఆ పార్టీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు. 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామ ఆ తర్వాత కొద్ది కాలానికే పార్టీకి దూరమయ్యారు. అధిష్టానం నిర్ణయాలు నచ్చని ఆయన వైసీపీకి దూరమయ్యారు. నిత్యం సోషల్‌ మీడియాలో, యూట్యూబ్‌ చానెళ్లలోనూ, టీవీ చానెళ్లలోనూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రఘురామపై రాజద్రోహం నేరం మోపిన వైసీపీ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేయించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా విచారణలో సీఐడీ అధికారులు తనను కొట్టారని రఘురామ ఆరోపించడం కలకలం రేపింది.

మరోవైపు 2024 ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు నరసాపురం నుంచే ఎంపీగా పోటీ చేస్తానని చెబుతున్నారు. ఉభయగోదావరి, విశాఖపట్నం వంటి జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో అత్యధికంగా ఉన్న క్షత్రియ సామాజికవర్గంలో మంచి పట్టు ఉన్న నేతగా రఘురామకు పేరుంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాల్లో ఎక్కడి నుంచి పోటీ చేసినా తన గెలుపు సునాయాసమని భావిస్తున్నారు.

అయితే నరసాపురం నియోజకవర్గం నుంచే ఎంపీగా పోటీ చేస్తానని రఘురామకృష్ణరాజు తెలిపారు. తనకు బీజేపీ, టీడీపీ, జనసేన ఇలా మూడు పార్టీల అధినేతలతో సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ మూడు పార్టీల పొత్తు కుదురుతుందని ఆయన చెప్పారు. ఈ క్రమంలో నరసాపురం సీటు పొత్తులో భాగంగా ఎవరికి దక్కితే ఆ పార్టీ నుంచి పోటీ చేస్తానని రఘురామకృష్ణరాజు వెల్లడించారు.

కాగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని రఘురామకృష్ణరాజు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను తరచూ ఆయన కలుస్తున్నారు. ఇదే విషయాన్ని స్వయంగా రఘురామకృష్ణరాజు వెల్లడించారు. తాను జనసేన, టీడీపీ అధినేతలు పవన్‌ కళ్యాణ్, చంద్రబాబుకంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఎక్కువగా కలుస్తున్నానని వివరించారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడానికి తనకున్న పరిచయాలన్నింటిని ఢిల్లీలో వినియోగిస్తున్నానని రఘురామకృష్ణరాజు తెలిపారు. అయినప్పటికీ తన పాత్రమీ లేకపోయినా ఎన్నికల నాటికి ఈ మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా నరసాపురం సీటు ఎవరికి దక్కినా తాను అక్కడి నుంచే మూడు పార్టీల్లో ఏదో ఒక పార్టీ తరఫున బరిలో ఉంటానన్నారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం తథ్యమని రఘురామకృష్ణరాజు తేల్చిచెప్పారు. ఈసారి క్రిస్టియన్లు సైతం వైసీపీకి ఓట్లేయరని తెలిపారు. గత ఎన్నికల్లో జగన్‌ సోదరి షర్మిల, ఆమె భర్త అనిల్‌.. క్రిస్టియన్లందరినీ సంఘటితం చేశారని గుర్తు చేశారు. ఈసారి జగన్‌ కు ఈ అవకాశం లేదన్నారు.

మరోవైపు జగన్‌ తల్లి విజయమ్మ, ఆయన సోదరి షర్మిల కూడా ఈసారి జగన్‌ తో లేరన్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ ఓటమి ఖాయమన్నారు. మొత్తం మీద రఘురామకృష్ణరాజు వచ్చే ఎన్నికల్లో తన భవితవ్యం మీద మంచి ఆశావహ దృక్పథంతో ఉన్నారు.