Begin typing your search above and press return to search.

జగన్ అసెంబ్లీకి రాడు-రఘురామ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ఆ రాష్ట్రం ఒక్కటే కాదు.. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది

By:  Tupaki Desk   |   24 May 2024 7:21 AM GMT
జగన్ అసెంబ్లీకి రాడు-రఘురామ
X

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ఆ రాష్ట్రం ఒక్కటే కాదు.. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. గత పర్యాయం 151 సీట్లతో భారీ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో గెలిచే అవకాశమే లేదని మెజారిటీ సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఈసారి కూడా తమదే విజయం అని.. 2019కి మించి సీట్లు సాధిస్తామని వైసీపీ నేతలు, కార్యకర్తలు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ.. లోలోన వారికీ ఓటమి గుబులు లేకపోలేదని అంటున్నారు. ఈ సంగతిలా ఉంచితే ఒకవేళ వైసీపీ ఓడిపోతే.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందన ఎలా ఉంటుంది.. గత ఐదేళ్లు ఎంతో వైభవం చూసిన ఆయన ఓటమి తర్వాత వచ్చే ఐదేళ్లు ఎలా వ్యవహరిస్తాడు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఐతే జగన్ ఓటమి తర్వాత అసలు అసెంబ్లీకే రాడని అంటున్నాడు వైసీపీ మాజీ నేత రఘురామ కృష్ణంరాజు.

2019 ఎన్నికల్లో నరసాపురం స్థానంలో వైసీపీ ఎంపీగా గెలిచి.. ఆ తర్వాత రెబల్‌గా మారి.. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రఘురామ.. ఎన్నికల ఫలితాల అనంతరం జగన్ అసలు అసెంబ్లీకే రాడని జోస్యం చెప్పడం విశేషం. తాజాగా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కాలే పెట్టరు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కాలే పెట్టడు. తట్టుకోలేడు. ఆయన స్వభావం నాకు తెలుసు. అవమానాన్ని తట్టుకోలేడు. అసెంబ్లీకైతే ఆయన రాడు’’ అని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. ఒకవేళ వైసీపీ ఓడిపోతే.. మొత్తంగా కాకపోయినా కొన్ని రోజుల పాటైతే జగన్ అసెంబ్లీకి రాకపోవచ్చనే రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. కాగా రఘురామ ఎమ్మెల్యేగా ఎన్నికైతే జగన్‌కు చెక్ పెట్టడానికే స్పీకర్‌ను చేయొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది.