అసెంబ్లీలో జగన్ తో మాట్లాడింది ఇదే... రఘురామ క్లారిటీ!
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 July 2024 3:43 AM GMTఏపీలో అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా.. జగన్ నల్లకండువాలతో నిరసన, పోలీసులకు హెచ్చరికలు, శాసనసభా పక్ష సమావేశంలో జగన్ పై పవన్ సెటైర్లు, చంద్రబాబు నిప్పులు కురిపించడాలు జరిగాయి. ఇదే సమయంలో... జగన్ దగ్గరకు వెళ్లి రఘురామ మాట్లాడటం మాత్రం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
అవును... సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నో కీలక పరిణామాలు ఉండగా.. జగన్ తో రఘురామ మాటామంతీ అనే విషయం మాత్రం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా... జగన్ తో రఘురామ కృష్ణంరాజు ఏమి మాట్లాడారు, అసలు ఎందుకు మాట్లాడారు.. తిరిగి రఘురామ కృష్ణంరాజుతో జగన్ ఏమి మాట్లాడారు అనేది తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
ఈ నేపథ్యంలో... జగన్ తో తాను ఏమి మాట్లాడింది వెల్లడించారు రఘురామ కృష్ణంరాజు. ఇందులో భాగంగా... ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదన్న కారణం చూపెడుతూ సభకు రాకూడదనే ఆలోచన సరికాదని జగన్ కు రఘురామ సూచించినట్లు చెబుతున్నారు. అసలు ఆ హోదాతో పనేముందని.. శాసనసభా పక్షానికి నాయకుడు మీరే, ఆ హోదాలో రండి అని జగన్ కు రఘురామ తెలిపారట.
అసలు సోమవారం ఏమి జరిగిందనేది ఇప్పుడు చూద్దాం...! సోమవారం జగన్ అసెంబ్లీకి ప్రవేశించిన తర్వాత సభ్యులందరికీ నమస్కారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలో రఘురామకృష్ణంరాజు తన సీటు నుంచి లేచి వచ్చి ఆయనను పలకరించారు. జగన్ సీటులోకి వెళ్లి కూర్చున్న తర్వాత.. ఆయన వద్దకు వెళ్లి మాట్లాడారు.
ఇందులో భాగంగా... అసలు ప్రతిపక్షనేత హోదాతో పనేముందని ప్రశ్నించిన ట్రిపుల్ ఆర్... "ముఖ్యమంత్రిగా చేసిన వారు మీరు.. మీ పార్టీ శాసనసభా పక్షానికి నాయకుడు మీరు.. ఆ హోదాలో రండి.. ప్రతిపక్ష నేత హోదా విషయం పక్కనపెట్టి సభా సమావేశాలకు కచ్చితంగా రండి" అని జగన్ కు సూచించారట!
ఈ విషయాలను వెళ్లడించిన రఘురామ... "తప్పకుండా వస్తాను" అని జగన్ సమాధానం చెప్పారని అన్నారు. ప్రస్తుతం ఈ విషయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.