ఎన్నాళ్ళకెన్నాళ్ళకు...మన ఎంపీ గారు వస్తున్నారోచ్...!
ఆయనే వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు. ఆయన వైసీపీ తరఫున 2019 ఎన్నికల్లో నర్సాపురం నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు
By: Tupaki Desk | 12 Jan 2024 3:34 PM GMTఆయన లక్షల మంది ప్రజలకు ప్రజా ప్రతినిధి. వారి తరఫున ఎంపీగా నెగ్గి పార్లమెంట్ లో ప్రజా సమస్యలు ప్రస్తావించే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వారు. ఆయన దాదాపుగా నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తరువాత తన సొంత నియోజకవర్గానికి వస్తున్నారు అంటే అది అతి పెద్ద వార్త కాదా మరి.
ఆయనే వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు. ఆయన వైసీపీ తరఫున 2019 ఎన్నికల్లో నర్సాపురం నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఆ తరువాత 2020 సంక్రాంతి పండుగకు హ్యాపీగానే సొంతూరుకు వచ్చారు. ఇక గెలిచిన తరువాత ఆరేడు నెలల పాటు ఆయన వైసీపీతో సఖ్యతగానే ఉన్నారు.
ఆ మధ్యలో ఏమి బెడిసిందో కానీ వైసీపీకి జగన్ కి వ్యతిరేకంగా తొలి గొంతు వినిపించిన వారు ఏపీలో రఘురామే కావడం విశేషం. సొంత పార్టీ నుంచి రఘురామ విమర్శలు ఎక్కుపెట్టి జగన్ మీద టార్గెట్ చేశారు. అప్పటికి విపక్షాలు అయితే పెద్దగా ప్రభుత్వం మీద సమరం చేయని సందర్భం ఉంది.
అంతా బాగుంది అన్న ఫీలింగ్ తో ప్రభుత్వం సాగుతున్న వేళ తొలిసారిగా విమర్శలు చేసి రఘురామ సంచలనం రేపారు. అలా వైసీపీ వర్సెస్ రఘురామ ఎపిసోడ్ చాలా కాలం పాటు నడచింది. ఆయన మీద అనర్హత వేటు వేయించడానికి వైసీపీ చేసిన ప్రయత్నాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ అవేమీ వర్కౌట్ కాలేదు.
ఇక రఘురామ 2021లో తన పుట్టిన రోజు వేళ హైదరాబాద్ లో ఉంటే ఆయన్ని తెచ్చి సీఐడీ అరెస్ట్ చేసింది. అదొక సంచలనంగా మారింది. ఆ కేసులో కూడా రఘురామ బెయిల్ పొందారు. దాని కంటే ముందు నుంచే ఆయన సొంత ఊరు నర్సాపురం రావడం మానేశారు. అంతే కాదు తన నియోజకవర్గంలో అసలు అడుగుపెట్టలేదు. ఇక 2022 జూలై 3న భీమవరంలో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ సభ కోసం రఘురామ రావాలనుకుని హైదరాబాద్ నుంచి కొంత దూరం బయల్దేరి మళ్లీ వెనక్కి వెళ్లిపోయారు.
తనను వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అని అనుమానించి ఆయన అలా చేశారని చెబుతారు. ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడిన వేళ రఘురామ న్యాయపరమైన రక్షణతో తన సొంత నియోజకవర్గంలో అడుగుపెడుతున్నారు. తాను ఈ సంక్రాంతి పండుగకు సొంతూరుకు వెళుతున్నానని, తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
అంతే కాతుతనపై ఇప్పటికే 11 కేసులు నమోదు చేశారని, మరో కేసు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందని రఘురామ గురువారం ఒక పిటిషన్ దాఖలు చేశారు. తనకు రక్షణ కల్పించాలని ఆయన హైకోర్టుని కోరారు. దీని మీద శుక్రవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. అటు ప్రభుత్వ పక్షం, ఇటు రఘురాం పక్షం వాదనలు విన్న అనంతరం రఘురామకృష్ణరాజుకు ఊరట కలిగించే నిర్ణయం వెలువరించింది.
రఘురామ విషయంలో 41ఏ సెక్షన్ విధివిధానాలను తప్పనిసరిగా అనుసరించాలని అరెస్ట్ నుంచి రఘురామకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో ఓ వ్యక్తి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ హైకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. దంతో రఘురామ తన సొంత ప్రాంతానికి వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. కోడి పందేలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు.
ఇక రఘురామ కూడా సంక్రాంతి సంబరాలకు ఎపుడూ తప్పనిసరిగా అటెండ్ అవుతూ ఉంటారు. ఆయన ఇంట ప్రతీ ఏటా సంబరాలు అంబరాన్ని అంటుతాయి. కానీ గత నాలుగేళ్లుగా ఆ సంబరాలు లేవని ఆయన వాపోతూ వచ్చారు. ఇపుడు ఆయన రెట్టించిన ఉత్సాహంతో చలో నర్సాపురం అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే ఒక ఎంపీగా రఘురామ నాలుగేళ్లుగా తన సొంత ప్రాంతానికి రాకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. సంక్రాంతి సంబరాలకు ఊరు వెళ్తానని కోర్టుని ఆశ్రయించిన ఆయన తాను ఎంపీగా తన ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఇవ్వాలని తనను అరెస్ట్ చేయకుండా చూడాలని అప్పట్లోనే ఒక పిటిషన్ దాఖలు చేసి ఉపశమనం పొంది ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తే బాగుండేది అన్న మాట వినిపిస్తోంది.
ఇవన్నీ పక్కన పెడితే 2024లో రఘురామ అయితే తెలుగుదేశం లేకపోతే జనసేన నుంచి ఎంపీగా పోటీ చేయలని చూస్తున్నారు. మరి ప్రజా న్యాయస్థానం ఆయన నాలుగేళ్ల గైర్ హాజరీ పట్ల ఎలాంటి తీర్పు ఇవ్వనుందో వేచి చూడాల్సి ఉంది.