ఈసారి అక్కడి నుంచి పోటీ చేస్తున్న ఆర్‌ఆర్‌ఆర్!
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి 20కి మించి అసెంబ్లీ స్థానాలు రావని ఆర్‌ఆర్‌ఆర్ తేల్చిచెబుతున్నారు.
By: Tupaki Desk | 29 Feb 2024 4:03 AM GMTపశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (ఆర్‌ఆర్‌ఆర్) గురించి తెలియనివారెవరూ లేరు. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలుపొందారు. అయితే గెలిచిన కొంతకాలానికే ఆయనకు వైసీపీ అధిష్టానంతో అభిప్రాయభేదాలు తలెత్తాయి. దీంతో అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో, యూట్యూబ్ చానెళ్ల ఇంటర్వ్యూల్లో ఘాటు విమర్శలు చేస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి 20కి మించి అసెంబ్లీ స్థానాలు రావని ఆర్‌ఆర్‌ఆర్ తేల్చిచెబుతున్నారు.
మరోవైపు వైసీపీ ప్రభుత్వం రఘురామరాజుపై పలు కేసులు నమోదు చేసింది. ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్ర చేశారని, ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారని ఇలా పలు కేసులు ఆయనపై నమోదు చేసింది. ఈ నేపథ్యంలో గతంలో సీఐడీ అధికారులు ఆయనను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. స్వయంగా తనను కొడుతూ తీసిన వీడియోను సీఐడీ అధికారులు వైఎస్ జగన్ కు పంపారని రఘురామ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి.
గత ఎన్నికల్లో గెలిచింది మొదలు రఘురామ ఒకటి రెండుసార్లు మినహా రాష్ట్రానికి వచ్చింది లేదు. తాను ఏపీలో అడుగుపెట్టడం ఆలస్యం జగన్ ప్రభుత్వం తనపై ఏదో కేసు నమోదు చేస్తోందని రఘురామ ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని కేంద్ర ప్రభుత్వం నుంచి వై కేటగిరీ రక్షణ సైతం పొందారు.
గత నెలలో సంక్రాంతి పండుగ కోసం తాను భీమవరం వస్తున్నానని.. జగన్ ప్రభుత్వం తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆయనను అరెస్టు చేయొద్దని.. ఆయనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది.
దీంతో రఘురామరాజు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు సంక్రాంతి పండుగకు తన సొంత ప్రాంతానికి విచ్చేశారు. ఆయనకు అప్పట్లో భారీ స్వాగతం లభించింది. కొద్ది రోజుల క్రితం వైసీపీకి రాజీనామా ప్రకటించిన రఘురామ తాజాగా టీడీపీ, జనసేన కూటమి తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన రఘురామకృష్ణరాజు వచ్చే ఎన్నికల్లో తాను నరసాపురం నుంచే పార్లమెంటుకు పోటీ చేస్తానని ప్రకటించారు. ఏ పార్టీ అనేది త్వరలో చెబుతానన్నారు. ఇంకా తాను ఏ పార్టీలో చేరలేదన్నారు. తాను మొన్నే దరిద్రపు పార్టీ అయిన వైసీపీని వదిలేశానని తెలిపారు. టీడీపీ, జనసేన కూటమి తరఫున నరసాపురంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కృష్ణార్జునుల్లా చంద్రబాబు, పవన్ కలిశారని సంతోషం వ్యక్తం చేశారు. ఒక దుర్మార్గుడిని అంతం చేయడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే కలిశారని గుర్తు చేశారు. చంద్రబాబు, పవన్ కలయిక కూడా అలాగే ఉందన్నారు.
మరోవైపు నర్సాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థి విషయంలో తెలుగుదేశం పార్టీ ఐవీఆర్‌ఎస్ సర్వేను చేపడుతోంది. ఆ సర్వేలో పార్టీ అభ్యర్థిత్వానికి టీడీపీ పరిశీలిస్తున్న వ్యక్తుల జాబితాలో రఘురామకృష్ణరాజు పేరు కూడా వినిపిస్తోంది. నర్సాపురం నుంచి రఘురామ ‘ఓకే అయితే 1 నొక్కండి’ అని చంద్రబాబు వాయిస్ వినిపిస్తోంది. దీంతో ఆయనను నర్సాపురం బరిలో దింపడం దాదాపు ఖాయమైనట్టేనని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
వాస్తవానికి రఘురామ బీజేపీ నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ తాజాగా టీడీపీ ఐవీఆర్‌ఎస్ సర్వేలో ఆయన పేరు వినిపిస్తుండడంతో టీడీపీ తరఫున ఆయన పోటీ చేస్తారని చెబుతున్నారు.