రఘురామ రామా ఈసారి అయినా రాజీనామా...!?
ఆయనకు వైసీపీ నచ్చదు, అధినాయకుడు జగన్ నచ్చరు. కానీ అయిదేళ్ల పాటు ఆ పార్టీ మెంబర్ గానే పార్లమెంట్ మెట్లు ఎక్కారు
By: Tupaki Desk | 23 Feb 2024 4:09 PM GMTఆయనకు వైసీపీ నచ్చదు, అధినాయకుడు జగన్ నచ్చరు. కానీ అయిదేళ్ల పాటు ఆ పార్టీ మెంబర్ గానే పార్లమెంట్ మెట్లు ఎక్కారు. తనను ఓట్లేసి గెలిపించిన నర్సాపురం పార్లమెంట్ ప్రజల ముఖం చూడకుండా అయిదేళ్ళూ గడిపేశారు. ఆయనే రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు. ఆయనకు వైసీపీ హై కమాండ్ కి ఎపుడో చెడింది. ఎంపీగా అయిన తొలి ఆరు నెలల కాలంలోనే బంధాలు అన్నీ కూడా కట్ అయ్యాయి.
అప్పటి నుంచి రెబెల్ గానే ఉంటూ వచ్చారు. ఢిల్లీ రచ్చబండను వేదికగా చేసుకుని వైసీపీ పెద్దల మీద విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. వైసీపీ బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చాక తొలి నిరసనను తెలియచేసింది. ఆయనే అనుకోవాలి. అలా రెబెల్ ఎంపీ రాజు గారు వైసీపీ హై కమాండ్ కి తలపోటు అయ్యారు.
ఆయన అప్పట్లో కొన్ని సార్లు ఎంపీ పదవికి రాజీనామా చేస్తా అని కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ ఆ సాహసం మాత్రం చేయలేకపోయారు. ఆయన ఒక దశలో రాజీనామా చేసి టీడీపీ జనసేన మద్దతుతో బీజేపీ నుంచి పోటీ చేయడం ద్వారా తిరిగి గెలిచి సత్తా చాటుకోవాలని అనుకున్నారు అని టాక్ నడచింది. కానీ టీడీపీ బీజేపీల మధ్య ఆనాటికి సంబంధాలు పెద్దగా లేవు. దాంతో రిస్క్ అవుతుందని ఆయన మానుకున్నారు అని చెబుతారు.
రాజీనామా చేస్తాను అని ఈ ఏడాది తొలి రోజులలో కూడా చెప్పారు. చివరి పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే రాజీనామా అని అన్నారు. అవి కూడా ఫిబ్రవరి 10తో ముగిసాయి. అయినా రాజు గారి నోట రాజీనామా మాట రాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన రాజీనామా అంటున్నారు.
ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో జరిగే టీడీపీ జనసేన ఉమ్మడి మీటింగులో పాల్గొంటాను అని చెబుతున్న రాజు గారు పనిలో పనిగా రాజీనామా కూడా చేస్తాను అని ప్రకటించారు. తన రాజీనామాను ఇచ్చేసిన తరువాతనే ఈ మీటింగులో పాల్గొంటాను అని అంటున్నారు. మరి ఈసారి అయినా ఆయన రాజీనామా చేస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది.
అయినా ఎన్నికలు తోసుకుని వస్తున్న వేళ ఇపుడు రాజీనామా చేసినా ఉపయోగం ఏమిటి అంటున్నారు. ఇప్పటికే చాలా మంది ఎంపీలు రాజీనామాలు చేశారు. కానీ ఏవీ ఆమోదం పొందలేదు. వారిని ఎవరూ కూడా అనర్హులుగా ప్రకటించమని కూడా కోరరు. ఎందుకంటే ఈసారి లోక్ సభ పదవీ కాలం కొద్ది రోజూల్లో ముగియబోతోంది. అయినా సరే వైసీపీ మీద విమర్శలు చేస్తూ రాజీనామా అంటున్నారు రాజుగారు. ఆయన రాజీనామా చేస్తే సంచలనం అవదు కానీ వార్తగా మాత్రం చెప్పుకునేందుకు వీలుంటుంది. అందుకే రాజీనామా చేస్తారా రాజు గారూ అని అంతా అంటున్నారు.