టీడీపీలో చేరిన వెంటనే కొత్త సీఎం ఎవరో చెప్పిన రఘురామ...!
ఆయనకు ఆప్యాయంగా చంద్రబాబు పసుపు కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.
By: Tupaki Desk | 5 April 2024 4:53 PM GMTమొత్తానికి వైసీపీ రెబెల్ నేత రఘురామ క్రిష్ణం రాజు టీడీపీలో చేరారు. పాలకొల్లులో శుక్రవారం రాత్రి జరిగిన చంద్రబాబు ప్రజాగళం సభలో రాజు గారు పసుపు తీర్ధం పుచ్చుకున్నారు. ఆయనకు ఆప్యాయంగా చంద్రబాబు పసుపు కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రఘురామ ఒక జోస్యం చెప్పారు. జూన్ 4న ఏపీలో ఏర్పడబోయేది టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అని అన్నారు. కొత్త సీఎం గా చంద్రబాబు ఉంటారని కూడా చెప్పారు. ఏపీలో కూటమి ప్రభంజనం క్రియేట్ చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే రఘురామ టీడీపీలో చేరడం ఇది కొత్తకాదు. గతంలో అంటే 2014 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో ఉన్నారు. ఆయన వైసీపీ నుంచి టీడీపీ బీజేపీలలో అపుడు రాజకీయ ప్రస్థానం చేశారు. అప్పట్లో ఆయన నర్సాపురం ఎంపీ టికెట్ ఆశించారు. అయితే కూటమిలో ఆనాడు రఘురామకు టికెట్ దక్కలేదు. ఆయన అయిదేళ్ల పాటు కూటమిలోనే ఉన్నారు 2019 నాటికి వైసీపీలో చేరి నర్సాపురం ఎంపీ టికెట్ సాధించారు. జగన్ వేవ్ లో ఆయన ఎంపీగా గెలిచారు
ఇక గెలిచిన ఆరు నెలల వ్యవధిలోనే ఆయన వైసీపీకి రెబెల్ గా మారిపోయారు. దాంతో ఆయనకు రెబెల్ ఎంపీ అన్న పేరు కూడా వచ్చింది. ఆ టైం లో ఆయన టీడీపీకి బాగా చేరువ అయ్యారు. నర్సాపురం ఎంపీగా తీడీపీ నుంచి పోటీ చేయాల్సి ఉంది.
అయితే పొత్తులో ఏ పార్టీకి సీటు దక్కుతుందో అని ఆయన వ్యూహాత్కమంగా టీడీపీలో చేరలేదు. బీజేపీకి టికెట్ ఇచ్చినా జనసేనకు దక్కినా ఆ పార్టీలో చేరి పోటీ చేయాలనుకున్నారు. బీజేపీకి నర్సాపురం పొత్తులో లభించింది. కానీ రఘురామకు ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు.
తమ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న శ్రీనివాసవర్మకు టికెట్ ఖరారు చేశారు దాని మీద రఘురామ ఎంత వత్తిడి పెట్టినా ప్రయోజనం లేకపోయింది. దాంతో ఆయన టీడీపీలో చేరారు. టీడీపీలో ఉండి అసెంబ్లీ నుంచి ఆయన పోటీ చేయనున్నారు అని టాక్ నడుస్తోంది.
ఈ మేరకు చంద్రబాబు నుంచి కచ్చితమైన హామీ తీసుకునే ఆయన టీడీపీలో చేరారు అని అంటున్నారు. మొత్తం మీద వైసీపీ రెబెల్ లీడర్ గా ఉన్న రఘురామకు ఆది నుంచి చంద్రబాబు మద్దతు దక్కుతూనే ఉంది. ఇపుడు అఫీషియల్ గా ఆ పార్టీ మనిషి అయిపోయారు అని అంటున్నారు.