ఎంపీగా వెంకటేష్ వియ్యంకుడు పోటీ.. పొంగులేటితోనూ బంధుత్వమే!
వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రితను రఘురామ్ రెడ్డి పెద్ద కొడుకు వినాయక్ రెడ్డి కిచ్చి 2019లో వివాహం చేశారు.
By: Tupaki Desk | 26 April 2024 3:45 AM GMTతెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేడి మరింత పెరిగింది. గురువారంతో... ఏ స్థానం నుంచి ఏయే అభ్యర్థులు పోటీ చేయబోతున్నారనే విషయంపై దాదాపు క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అభ్యర్థులంతా వారి వారి ప్రచారాలను మరింత హీటెక్కించబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన ఖమ్మం ఎంపీ టిక్కెట్ ని రామసహాయం రఘురామ్ రెడ్డి దక్కించుకోవడంతో ఆయన హాట్ టాపిక్ గా మారారు!
అవును... తెలంగాణ రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్ గా మారిన, పైగా.. కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖమ్మం లోక్ సభ టిక్కెట్ ను రామసహాయం రఘురామ్ రెడ్డి దక్కించుకున్నారు. అయితే... ఈ విషయంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి సక్సెస్ అయ్యారనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో.. విక్టరీ వెంకటేష్ ప్రస్థావనా తెరపైకి వచ్చింది. కారణం... అటు పొంగులేటికి, ఇటు విక్టరీ వెంకటేష్ కూ రఘురామ్ రెడ్డి వియ్యంకుడు కావడమే!
వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రితను రఘురామ్ రెడ్డి పెద్ద కొడుకు వినాయక్ రెడ్డి కిచ్చి 2019లో వివాహం చేశారు. వీరి వివాహం జైపూర్ లో అంగరంగ వైభవంగా జరగగా.. వీరు ప్రస్తుతం వీరిద్దరూ స్పెయిన్ లో ఉన్నారని అంటున్నారు. ఇదే సమయంలో... పొంగులేటి కూతురు స్వప్ని రెడ్డితో రఘురామ్ రెడ్డి చిన్న కొడుకు అర్జున్ రెడ్డికి వివాహం జరిగింది. ఇలా రఘురామ్ రెడ్డి రాజకీయంగానూ, సినిమా ఇండస్ట్రీ జనాలతోనూ గట్టి బందుత్వం కలిగి ఉన్నారు.
ఇదే క్రమంలో... సీనియర్ రాజకీయ నాయకుడు అయిన సురేంద్ర రెడ్డి కుమారుడే ఈ రఘురామ్ రెడ్డి. ఈయన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఇక, సురేందర్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంతోపాటు.. వరంగల్ లోక్ సభ స్థానం నుంచి నాలుగుసార్లు ఎంపీగా కూడా గెలుపొందారు.
ఈ నేపథ్యంలో... ఆయన కుమారుడైన రఘురామ్ ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారన్నమాట. మరి కీలకమైన ఈ స్థానం నుంచి రఘురామ్ గెలుస్తారా.. గెలిచి పార్లమెంట్ లో అడుగుపెడతారా అనేది వేచి చూడాలి!
కాగా... 2019 ఖమ్మం లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరిపై.. బీఆరెస్స్ అభ్యర్థి నామా నాగేశ్వర రావు 1,68,062 ఓట్ల మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈసారి కూడా బీఆరెస్స్ నుంచి నామా నాగేశ్వర రావే పోటీ చేస్తున్న నేపథ్యంలో... కాంగ్రెస్ నుంచి మాత్రం ఖమ్మంలో కీలక నేత పొంగులేటి వియ్యంకుడు బరిలోకి దిగుతున్నారు. దీంతో గట్టి పోటీ కన్ ఫాం అని అంటున్నారు పరిశీలకులు!