రెబెల్ ట్యాగ్ తో మళ్లీ రఘురామ ?
ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ అంటున్న మాటలు వేస్తున్న సెటైర్లు మరోసారి రెబెల్ అవతారం ఎత్తబోతున్నారా అన్న సందేహాన్ని కలిగిస్తున్నాయని అంటున్నారు.
By: Tupaki Desk | 18 July 2024 3:48 AM GMTతనకు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి పదవులు దక్కలేదని తీవ్ర అసంతృప్తితో రఘురామ క్రిష్ణం రాజు ఉన్నారా అన్న చర్చ సాగుతోంది. ఆయన ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్ధలు కొట్టే రకం. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ అంటున్న మాటలు వేస్తున్న సెటైర్లు మరోసారి రెబెల్ అవతారం ఎత్తబోతున్నారా అన్న సందేహాన్ని కలిగిస్తున్నాయని అంటున్నారు.
ఇక పోతే ఉండి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామ క్రిష్ణం రాజు టీటీడీ చైర్మన్ పోస్ట్ మీద కన్నేశారా అంటే ఆయన మాటలు వింటే అవును అనే జవాబు వస్తుంది. తనకు ఈ కీలకమైన పోస్ట్ దక్కాలని ప్రజలు అనుకుంటున్నారు అని రఘురామ చెబుతున్నారు. అంతే కాదు ఉండి నియోజకవర్గం నుంచి ఇప్పటికే నలుగురు టీటీడీపీ చైర్మన్లుగా పనిచేశారు అని గుర్తు చేశారు. వారంతా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారే అని అన్నారు.
తన సొంత చిన్నాన్న మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు కూడా టీటీడీ చైర్మన్ అయ్యారని చెప్పారు. అయితే ఇవన్నీ క్రెడిటేరియా అని తాను అననని అధినాయకత్వం మనసులో ఏముంటే అదే జరుగుతుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తనకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే అంతకంటే భాగ్యమా అని ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేశారు.
తాను వెంకటేశ్వర స్వామి వారి భక్తుడిని అని ఆయన అన్నారు. తమ కుటుంబానికి స్వామి వారు ఇలవేలుపు అన్నారు. ఆయన సేవలో తరించే అదృష్టం వస్తుంది అనుకుంటే ఎవరు కాదనుకుంటారు అని ప్రశ్నించారు. తనకు మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడం పట్ల ఆయన ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేసే లాగానే మాట్లాడారు.
ప్రజలు అయితే తాను కచ్చితంగా మంత్రిని అవుతాను అనుకున్నారని తనకు కీలకమైన శాఖను కూడా ఇచ్చేసారు అని ఆయన అన్నారు. అయితే ఎవరిని మంత్రిగా తీసుకోవాలి అన్నది నాయకుడి ఇష్టమని ఆ విధంగా చూస్తే తనకు మంత్రి పదవి దక్కలేదని అన్నారు. అయితే తాను స్పీకర్ కావాలన్నది కూడా ప్రజల కోరికే అని అన్నారు. కానీ ఆ పదవి రాలేదని తనకు ఆ విషయంలో ఎలాంటి బాధా లేదని అన్నారు.
తనకు పదవుల కంటే ప్రజాభిమానమే ముఖ్యమని తాను రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అభిమానంగా పలకరిస్తారు అని అన్నారు. తనను గుర్తు పడతారు అని మంత్రిని అయినా గుర్తు పట్టలేకపోవచ్చేమో కానీ తనకు ఆ ఆదరణ ఉందని ఆయన సెటైర్లు వేశారు.
మొత్తం మీద చూస్తే మంత్రి పదవి దక్కలేదన్న బాధ అయితే రఘురామలో ఉందని అంటున్నారు. మంత్రి వర్గంలో మిగిలి ఉన్న ఒకే ఒక కేబినెట్ పదవి తన కోసమో కాదో తనకు ఎలా తెలుస్తుందని ఆయన అన్నారు. అధినాయకుడు ఎవరికి అనుకుంటే వారికే దక్కుతుందని అన్నారు.
రఘురామ విషయంలో కూటమి పెద్దలు ఏ విధంగా అనుకుంటున్నారు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఆయనను జస్ట్ ఎమ్మెల్యేగానే చూస్తున్నారా లేదా ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది. అయితే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే రఘురామ మాత్రం మనసులో ఉన్నది దాచుకోలేకపోతున్నారు అని అంటున్నారు. దీంతో ఆయన కూటమిలో కూడా రెబెల్ గా మారుతారా అన్న చర్చ అయితే వస్తోంది.