రాహుల్ ది బ్రాహ్మణ కులం.. హిందూ మతం.. బీజేపీకి జగ్గారెడ్డి జవాబు
ప్రధాని మోదీ అసలు బీసీనే కాదని.. ఆయన గుజరాత్ సీఎం అయ్యాక తన కులాన్ని బీసీల్లో చేర్చారని వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 16 Feb 2025 8:38 AM GMTకాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇచ్చిన దేశవ్యాప్త కుల గణన హామీ మంటలు రేపుతూనే ఉంది. గత ఏడాది ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ కు అధికారం దక్కకపోయినా.. తెలంగాణలో ఉన్న ఆ పార్టీ ప్రభుత్వం కుల గణన చేపట్టింది. అయితే, దీనిపై వస్తున్న విమర్శలు, ఆరోపణలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల కిందట దీటుగా బదులిచ్చారు. ప్రధాని మోదీ అసలు బీసీనే కాదని.. ఆయన గుజరాత్ సీఎం అయ్యాక తన కులాన్ని బీసీల్లో చేర్చారని వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీది ఏ కులం..? ఏ మతం? అని నిలదీశారు. రాహుల్ గాంధీ ఫ్యామిలీ ట్రీని ప్రశ్నించారు.
బీజేపీ విమర్శలకు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి సమాధానాలు ఇచ్చారు. రాహుల్ కుటుంబం గురించి పూర్తి వివరణ ఇచ్చారు. రాహుల్ బ్రాహ్మణ కులానికి చెందినవారని.. వారిది హిందూ మతం అని స్పష్టం చేశారు. హిందూ ధర్మం ప్రకారం భర్త మతమే భార్యకూ వస్తుందని.. కాబట్టి రాజీవ్ గాంధీ హిందూ మతమే సోనియాకూ వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు చేసే విమర్శల్లో కొన్నయినా వాస్తవాలు ఉండాలని హితవు పలికారు. నెహ్రూ కుటుంబం కులమతాలకు అతీతంగా పనిచేసిందని జగ్గారెడ్డి తెలిపారు.
జగ్గారెడ్డి వివరణలో వాస్తవం ఉంది. జవహర్ లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు. వందేళ్ల కిందటే ప్రముఖ న్యాయవాది. వీరిది కశ్మీరీ పండిట్ల ఫ్యామిలీ. అక్కడినుంచి ఉత్తరప్రదేశ్ లోని అలహబాద్ (నేటి ప్రయాగ్ రాజ్)కు వలస వచ్చారు. కశ్మీరీ పండిట్లు అంటే బ్రాహ్మణులు.
ఇక జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ. ఈమె పార్శీ అయిన ఫిరోజ్ గాంధీని వివాహం చేసుకున్నారు. ఇందిర పెద్ద కుమారుడైన రాజీవ్ గాంధీ ఇటలీకి చెందిన సోనియాను వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడు రాహుల్ గాంధీ అవివాహితుడు. కుమార్తె ప్రియాంక గాంధీ క్రౌస్తవ మతానికి చెందిన రాబర్ట్ వాద్రాను వివాహం చేసుకున్నారు.
నెహ్రూ కుటుంబం దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా.. వారికి కులం, మతం పట్టింపు అనేది లేదనిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ వివరాలు చెబుతూ జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు.