Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ పెద్దలకు షాక్ ఇచ్చేలా రాహుల్ లో మార్పు

ఆయన మూడేళ్ళుగా రాహుల్ గాంధీతో అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   15 March 2025 6:00 AM IST
కాంగ్రెస్ పెద్దలకు షాక్ ఇచ్చేలా రాహుల్ లో మార్పు
X

కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీలో గణనీయమైన మార్పు వస్తోంది అని అంటున్నారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ లో క్షీణత మొదలు కావడంతో పార్టీ ఇబ్బందులో ఉండడంతో రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో పార్టీ ప్రక్షాళనకు ఉపక్రమించారు అని అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఈ రోజున చాలా రాష్ట్రాలో మూడవ స్థానంలో ఉంది. కాంగ్రెస్ చేతిలో కేవలం మూడు రాష్ట్రాలే సొంతంగా అధికారం చలాయించేలా ఉన్న్నాయి. దాంతో కాంగ్రెస్ లో నే అంతర్మధనం మొదలైంది. ఇలాగే వదిలేస్తే పార్టీ ఇబ్బందులో పడుతుంది అని అంతా అంటున్నారు.

ఈ క్రమంలో సీనియర్ నేతలతో వన్ టూ వన్ భేటీకి రాహుల్ గాంధీ ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ఏళ్ళ తరబడి వెయిట్ చేసిన వారిని సైతం ఆయనే పిలిచి మరీ గంటల తరబడి చర్చిస్తున్నారు.

అలా కాంగ్రెస్ లో మేధావిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి శశిధరూర్ తో రాహుల్ సమావేశం కావడం విశేషం. ఆయన మూడేళ్ళుగా రాహుల్ గాంధీతో అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆయనే ఆశ్చర్యపోయేలా రాహుల్ గాంధీతో గంటల పాటు భేటీ జరిగింది.

ఈ సందర్భంగా శశిధరూర్ తన అభిప్రాయాలను కచ్చితంగా రాహుల్ గాంధీతో పంచుకున్నారని అంటున్నారు. నిజానికి శశిధరూర్ ని పార్లమెంట్ లో కూడా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ఇంతకాలం సైడ్ చేసారు. ఇపుడు నష్ట నివారణ చర్యలలో భాగంగా రాహుల్ ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

మరో వైపు చూస్తే మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబంలో ఉంటూ వస్తున్న రాజీవ్ శుక్లా మోహన్ ప్రకాష్ అజోయ్ కుమార్ వంటి అనుభవం కలిగిన నాయకులతో పాటు గుజరాత్ మాజీ సీఎం మాధవ్ సింగ్ సోలంకి కుమారుడు భరత్ సోలంకి వంటి కీలక నేతలతో వరుసగా రాహుల్ గాంధీ భేటీలు వేస్తున్నారు.

పార్టీ పునర్ నిర్మాణం మీదనే వీరితో ఆయన చర్చిస్తున్నారని అంటున్నారు. ఈ భేటీల మీద సీనియర్లు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీకి ఇప్పటికీ ఎంతో తేడా ఉందని వారు అంటున్నారు. రాహుల్ గతంలో తాము ఇచ్చిన ఏ ప్రజంటేషన్ మీద అయినా ఎక్కువగా ఆసక్తి చూపించే వారు కాదని ఇపుడు మాత్రం ఆయన ప్రతీ విషయం అడిగి మరీ తెలుసుకోవడం శుభ పరిణామంగా చెబుతున్నారు.

ఇక చూస్తే కనుక అంకిత భావంతో పనిచేసేవారికే పదవులు ఇస్తూ రాహుల్ పార్టీలో కొత్త జోష్ తెస్తున్నారు. తెలంగాణాకు మీనాక్షీ నటరాజ్, బీహార్ కి క్రిష్ణ అలవూరు వంటి నాయకులని నియమించడం అందులో భాగమే అని అంటున్నారు. బీహార్ లో పార్టీని పటిష్టం చేసి ఈ ఏడాది చివరిలో జరిగే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేలా చేయడానికే క్రిష్ణ అలవూరు ని నియమించారు.

ఇక మీనాక్షీ నటరాజన్ నియామకం కూడా తెలంగాణాలో కాంగ్రెస్ మరింత జోరు చేయడానికే అని అంటున్నారు. ఈ ఏడాది జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరిగే అసోం కేరళ రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ అవకాశాలు పెంచడానికే రాహుల్ ఈ మేధోమధనం నిర్వహిస్తున్నారు అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే రాష్ట్రాలలో కాంగ్రెస్ తాను గెలవకపోయినా ఇతర పార్టీలని ఓడించడానికి గెలిపించడానికి సరిపడా ఓట్లు తెచ్చుకుంటోంది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి 45 శాతం పైగా ఓట్లు వస్తే ఆప్ కి 43 శాతంగా వచ్చాయి. కాంగ్రెస్ కి ఆరు శాతం ఓట్లు వచ్చాయి. దాంతో ఆప్ కాంగ్రెస్ పొత్తు ఉంటే మూడవ సారి కేజ్రీవాల్ సీఎం అయ్యేవారు అని గుర్తు చేస్తున్నారు.

అలా రాష్ట్రాలలో తమ బలాన్ని చూపించి సీట్ల బేరాలను గట్టిగా చేసుకుని అక్కడ బలపడాలని కాంగ్రెస్ చూస్తోంది. ఇక ఎంపీ ఎన్నికల్లో ఎటూ కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చాటుకోవడం ద్వారా కేంద్రంలో అధికారం కోసం బాటలు వేస్తుందని అంటున్నారు. మొత్తానికి రాహుల్ గాంధీ 2029 ఎన్నికల మీద ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ ని ఈసారి ఎలాగైనా అధికారంలోకి తేవాలని పట్టు బడుతున్నారు. సో కాంగ్రెస్ కి మంచి రోజులు వచ్చినట్లే అంటున్నారు.