రాహుల్ జీ.. చింతన్ శిబిర్ పెట్టుకోండి: ఇండియా నేతల దాడి
కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని ఇండియా కూటమి.. విచ్చిన్నం దిశగా అడుగులు వేసేందుకు రెడీ అయింది.
By: Tupaki Desk | 8 Feb 2025 12:30 PM GMTఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పతనం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న దరిమిలా.. ఈ ప్రభావం కాంగ్రెస్ అగ్రనాయకుడు, ఎంపీ.. రాహుల్‌గాంధీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని ఇండియా కూటమి.. విచ్చిన్నం దిశగా అడుగులు వేసేందుకు రెడీ అయింది. అంతేకాదు.. ఇండియా కూటమి నాయకులు రాహుల్‌ను అసమర్థుడని.. చెత్త నాయకుడని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి బీజేపీ కంటే.. రాహులే కారణమయ్యారన్న వాదన ఇండియా కూటమి నుంచి బలంగా వినిపిస్తుండడం గమనార్హం. జాతీయస్థాయిలో పొత్తు పెట్టుకుంటామని.. ప్రాంతీయ స్థాయి లో పోట్లాడుకుంటామని.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. మధ్య, చివరలోనూ.. రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిని అప్పట్లోనే కొందరు తప్పు బట్టారు. ముఖ్యంగా బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌లు నిప్పులు చెరిగారు.
ఇక, ఇప్పుడు ఈ జాబితాలో జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా చేరిపోయారు. వీరంతా కాంగ్రెస్‌ను నిన్న మొన్నటి వరకు సమర్థించిన వారే. కానీ, ఢిల్లీ ఎన్నికల విషయంలో రాహుల్ గాంధీ తీసుకున్న స్టాండును వారు తీవ్రంగా దుయ్యబట్టారు. అయినా.. తమ వంతు ప్రయత్నం చేసిన.. ఆప్‌ను గెలిపించే ప్రయత్నం కూడా చేశారు. కానీ.. తాజాగా ఆప్ ఓటమి దిశగా దూసుకుపోతోంది. ఈ విషయంపై స్పందించిన నాయకులు.. రాహుల్ ది తప్పుకాదు.. రాజకీయ ఘోరం అని వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.... ఇండియా కూటమిపై విమర్శలు చేశారు. ``ఇంత తెలివి తక్కువ వారి(రాహుల్)తో ప్రయాణం చేయాల్సి వస్తుందని అనుకోలేదు. మనం మనం కొట్లాడుకుంటే ఫలితాలు ఇలానే వస్తాయి. ఇంకా కొట్లాడుకోండి ఇంకా దారుణ ఫలితాలు వస్తాయి. అప్పుడు ఓమూల కూర్చుని చింతన్ శిబిర్‌లు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది`` అని సీఎం ఒమర్ అబ్దుల్లా ఎద్దేవా చేశారు.