రక్షణ మంత్రికి జాతీయ జెండా ఇచ్చిన రాహుల్... పరమార్థం ఏమిటంటే..?
అదానీ వ్యవహారంపై చర్చకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని అంటున్నారు!
By: Tupaki Desk | 11 Dec 2024 3:45 PM GMTశీతాకాల సమావేశాలు మొదలైనప్పటినుంచి పార్లమెంటులో ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా అదానీ వ్యవహారంతో పాటు మరికొన్ని అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో... గత వారం అంతా సభా కార్యకలాపాలు స్తంభించాయి. అదానీ వ్యవహారంపై చర్చకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని అంటున్నారు!
ఈ విధంగా అదానీ వ్యవహారంపై పార్లమెంట్ లో చర్చ జరపాలన్న డిమాండ్ తో కాంగ్రెస్ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తోంది. ఫలితంగా సభ వరుసగా వాయిదాలు పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పార్లమెంటు ఆవరణలో వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
అవును... గౌతం అదానీ పై వచ్చిన ఆరోపణల విషయంలో పార్లమెంట్ లో చర్చలు జరపాలని విపక్షలు పట్టుబడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇందులో భాగంగా... కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ ఆవరణలో నిల్చుని.. సమావేశాలకు హాజరైన బీజేపీ నేతలకు జాతీయ జెండా, గులాబీలను అందజేస్తూ నిరసన తెలిపారు.
సరిగ్గా అదే సమయంలో వచ్చిన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ పార్లమెంటులోకి వెళ్తుండగా.. రాహుల్ గాంధీ, ఇతర నేతలు ఆయన వద్దకు వచ్చి జాతీయ జెండా, గులాబీని ఆయనకు ఇచ్చి వెళ్లారు. ఈ సంఘటనను పలువురు ఎంపీలు ఆసక్తిగా వీక్షించారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ మాట్లాడుతూ.. ఈ నిరసన ఉద్దేశ్యాన్ని వివరించారు.
ఇందులో భాగంగా... ఇతర విషయాల కంటే దేశం చాలా ముఖ్యమైనది అనే విషయాన్ని బీజేపీ నేతలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే వారికి జాతీయ జెండాలు ఇచ్చామని అన్నారు. ఈ సందర్భంగా ఈ నిరసన ఆసక్తిగా మారింది. అదానీకి సంబంధించిన చర్చ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరి ఈ సందర్భంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు.
కాగా... మంగళవారం నాడు కాంగ్రెస్ నేతలు పలువురు ప్రధాని మోడీ, గౌతం అదానీ చిత్రాలతో ఉన్న వినూత్నమైన బ్యాగులు ధరించి నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... బ్యాగ్ కి ఒకవైపు మోడీ, అదానీ చిత్రాలు.. మరోవైపు "మోడీ - అదానీ భాయ్ భాయ్" అనే నినాదం ముద్రించి నిరసన తెలిపారు.