మాయావతి ప్లేస్ లోకి కాంగ్రెస్...రాహుల్ నయా ప్లాన్ !
పదకొండు నెలలకే నేషనల్ ఫ్రంట్ ని కూల్చేసిన బీజేపీ మందిర్ ఇష్యూతో జనంలోకి వెళ్ళింది.
By: Tupaki Desk | 29 March 2025 2:30 AMజాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ రెండిందాల చెడింది 1990 దశకంలోనే. ఒక వైపు మండల్ కమిషన్ నినాదాన్ని అప్పటి నేషనల్ ఫ్రంట్ కన్వీనర్, ప్రధాని వీపీ సింగ్ అందుకున్నారు. పదకొండు నెలలకే నేషనల్ ఫ్రంట్ ని కూల్చేసిన బీజేపీ మందిర్ ఇష్యూతో జనంలోకి వెళ్ళింది.
అలా చూస్తే కనుక మండల్ రాజకీయంతో కాంగ్రెస్ కి బడుగులు దళితులు దూరం అయ్యారు. మందిర్ రాజకీయంతో అగ్ర వర్ణాల మద్దతు పోయింది. దాంతో గత మూడున్నర దశాబ్దాల నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కి చిల్లులు పడుతోంది. ఆ పార్టీ గట్టిగా గెలిచింది 150 సీట్లలోనే. ఈ మధ్య చూస్తే రెండు ఎన్నికల్లోనూ అర్ధ సెంచరీ దగ్గరే ఆగిన కాంగ్రెస్ 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 99 సీట్లతో గెలిచి మళ్ళీ పూర్వ వైభవం కోసం చూస్తోంది.
ఇక దేశంలో రాజకీయం మారుతోంది. ప్రాంతీయ పార్టీలను బీజేపీ ఒక్కోటిగా దెబ్బ తీస్తోంది. అది ఒకందుకు కాంగ్రెస్ కే మేలు చేస్తోంది. అలాగే బీఎస్పీ లాంటి పార్టీల మనుగడ సైతం ప్రశార్ధకం అవుతున్న వేళ కాంగ్రెస్ లో కొత్త ఆశలు మొలకెత్తుతున్నాయి. బీఎస్పీ 1990 ప్రాంతంలో దళితులలను పెద్ద సంఖ్యలో తిప్పుకుని యూపీ వేదికగా చేసిన రాజకీయాలలో కాంగ్రెస్ కి ఉత్తరప్రదేశ్ సహా కీలక రాష్ట్రాలలో ఆయా సామాజిక వర్గాల మద్దతు లేకుండా పోయింది.
అయితే బీజేపీ యూపీలో తమ ప్రాభవాన్ని పెంచుకోవడంతో బీఎస్పీ వంటివి తగ్గుతూ వస్తున్నాయి. గత కొంతకాలంగా బీఎస్పీ సరైనా పెర్ఫార్మెన్స్ పొలిటికల్ గా చేయలేకపోతోంది. దీంతో 19 నుంచి 20 శాతం గా ఉన్న దళిత ఓటు బ్యాంక్ అన్నది తమ వైపునకు తిప్పుకోవాలని కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. బీఎస్పీ రాకతో చెల్లాచెదురు అయిన కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని పటిష్టం చేసుకోవడానికి అగ్ర నేత రాహుల్ గాంధీ వ్యూహరచన చేస్తున్నారు.
అంబేద్కర్ వాదాన్ని ముందుకు తెస్తూ ఆయన అడుగుజాడలలో కాంగ్రెస్ నడుస్తుందని చెప్పడం అందులో భాగమే అని అంటున్నారు. ఇక మరో వైపు గాంధీజీ బాటలో నడుస్తామని కూడా కాంగ్రెస్ ప్రకటిస్తోంది. గాంధీజీ బలహీన వర్గాల వైపు ఉండేవారు. మైనారిటీ సెక్షన్లతో పాటు అన్ని వర్గాలకు సముచితమైన స్థానం ఉండాలని కోరుకున్నారు. కాంగ్రెస్ అదే తమ విధానం అంటోంది.
ఆ విధంగా మైనారిటీలను కూడా తమ వైపునకు తిప్పుకునేందుకు చూస్తోంది. ఇక ఏప్రిల్ 9న గుజరాత్ లో కాంగ్రెస్ అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహిస్తోంది. గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అదే సమయంలో 2029 ఎన్నికలకు సంబంధించిన రోడ్ మ్యాప్ ని రెడీ చేయడానికి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు అని అంటున్నారు.
కులగణన అన్న నినాదం కాంగ్రెస్ ఎత్తుకోవడం వెనక కూడా బీజేపీ ఎత్తులను చిత్తు చేసే ప్లాన్ ఉందని అంటున్నారు. అంటే ఇటు బీసీలు అటు ఎస్సీలు ఇంకో వైపు మైనారిటీలను ఆకట్టుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తమ పూర్వ ఓటు బ్యాంక్ ని దక్కించుకుంటే కనుక 2029 నాటికి కేంద్రంలో అధికారం మంచి సీట్లతో అందుకునేందుకు చాన్స్ ఉంటుందని భావిస్తోంది. రాహుల్ గాంధీ కూడా ఇటీవల మేధావులతో చర్చిస్తున్నారు. పార్టీ సీనియర్ల అభిప్రాయాలను గమనంలోకి తీసుకుంటున్నారు. బీజేపీకి మళ్ళీ చాన్స్ ఇవ్వకూడదు అన్న పట్టుదలలో ఆయన ఉన్నారు. మరి రాహుల్ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.