Begin typing your search above and press return to search.

న‌రేంద్ర మోడీ... 'భార‌త‌ బైడెన్': రాహుల్ ర‌చ్చ

మ‌హారాష్ట్ర‌లో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చా రంలో రోజుకొక వివాదాస్ప‌ద అంశం తెర‌మీదికివ‌స్తోంది

By:  Tupaki Desk   |   17 Nov 2024 4:12 AM GMT
న‌రేంద్ర మోడీ... భార‌త‌ బైడెన్:  రాహుల్ ర‌చ్చ
X

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ రాజ‌కీయ ర‌చ్చ‌కు తెర‌దీశారు. మ‌హారాష్ట్ర‌లో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చా రంలో రోజుకొక వివాదాస్ప‌ద అంశం తెర‌మీదికివ‌స్తోంది. దీనిలో ఎవ‌రూ త‌క్కువ కాదు. ఎవ‌రూ త‌క్కువ తిన‌లేదు. అటు బీజేపీ కూట‌మి, ఇటు కాంగ్రెస్ కూట‌ములు రెండూ కూడా హోరా హోరీ త‌ల‌ప‌డుతున్న నేప‌థ్యంలో రాజ‌కీయ ర‌చ్చ రూపాంతరం చెందు తూ వివాదాల‌ను మ‌రింత పెంచి పోషిస్తుండ‌డం గ‌మ‌నార్హం. రెండురోజుల కిందట‌... హిందువులు ఐక్యంగా లేక‌పోతే.. విభ‌జన జ‌రుగుతుందంటూ.. యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ చేసిన వ్యాఖ్య‌ల దుమారం ఇప్ప‌టికీ చ‌ల్లార‌లేదు.

సీఎం యోగిపై సొంత పార్టీ బీజేపీ నేత‌లే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న ప‌రిస్థితి నెల‌కొంది. ఇక‌, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇలాంటి రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లే తెర‌మీదికి వ‌స్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని మ‌హాయుతి కూట‌మి మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే.. ముస్లింల‌ను త‌రిమేస్తారంటూ.. ఆ పార్టీ నాయ‌కులు యాగీ చేస్తున్నారు. ఇక‌, ఎంఐఎం పార్టీపై బీజేపీ అనుకూల వ్య‌క్తులు నిప్పులు చెరుగు తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇలా.. అటు ఇటు రెండు ప‌క్షాలు కూడా.. చ‌లికాలంలో మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల క్ర‌తువును నిప్పుల కొలిమిలా మార్చేశాయి. రాజ‌కీయ సెగ‌లు పుట్టిస్తున్నాయి.

ఇక‌, ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ప్ర‌ధాన మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు న‌రేంద్ర మోడీని ఉద్దేశించి `భార‌త బైడెన్‌` అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమెరికాఅధ్య‌క్షుడుగా ఉన్న జో బైడెన్ తో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని పోలుస్తూ.. తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు బైడెన్‌తో ఎవ‌రూ ఎవ‌రినీ పోల్చ‌లేదు. కానీ, తొలిసారి రాహుల్ గాంధీ మాత్రం మోడీని బైడెన్‌తో పోల్చ‌డం వివాదానికి దారితీస్తోంది. అమెరికా ప్ర‌స్తుత అధ్య‌క్షుడు బైడెన్‌.. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన చ‌ర్చ‌ల సంద‌ర్భంగా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు.

బైడెన్ మ‌తిమ‌రుపు వ్యాధితో బాధ‌ప‌డుతున్నార‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీనికి కార‌ణం.. ఆయ‌న పలు సంద‌ర్భా ల్లో వ్య‌వ‌హ‌రించిన తీరు, చేసిన కామెంట్లే. ఉక్రెయిన్ అధ్య‌క్షుడు పుతిన్ అని.. అమెరికా ఎన్నిక‌లు వ‌చ్చే ఏడాది జ‌రుగుతాయ‌ని ఇలా అనేక వ్యాఖ్య‌లు చేశారు. అదేవిధంగా తన ప్ర‌సంగం స‌మ‌యం అయిపోయిన త‌ర్వాత‌.. కూడా మైకు వ‌ద‌ల‌కుండా.. స్టేజీపైనే ఉండిపోయారు. దీంతో బైడెన్ మ‌తిమ‌రుపుతో ఇబ్బంది ప‌డుతున్నార‌న్న కామెంట్లు కురిశాయి. ఇక‌, ఇప్పుడు వీటిని మోడీకి అన్వ‌యించిన రాహుల్ గాంధీ.. భార‌త బైడెన్ మోడీయేన‌ని వ్యాఖ్యానించారు. ఈయ‌న కూడా మ‌తిమ‌రుపు వ్యాధితో బాధ‌ప‌డుతున్నార‌ని తెలిపారు.

గ‌తంలో తాను చెప్పిన విష‌యాలే ఇప్పుడు మోడీ ప్ర‌స్తావిస్తున్నార‌ని.. వ్యాఖ్యానించారు. కుల గ‌ణ‌న‌, రిజ‌ర్వేష‌న్ల అంశాల‌పై గ‌తంలో తాను చెప్పిన విష‌యాలు ఏవీ మోడీకి గుర్తులేవ‌ని.. అందుకే వాటిని కొత్త‌వాటిగా క‌ల‌రింగ్ ఇస్తూ.. మ‌ళ్లీ ప్ర‌చారం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ``రిజ‌ర్వేష‌న్లు ఉండాల‌ని నేను అన్నాను. కానీ, మోడీ మాత్రం న‌న్ను రిజ‌ర్వేష‌న్ల‌కు వ్య‌తిరేకం అంటున్నాడు. నేను కుల గ‌ణ‌న‌కు అనుకూలంగా ఉన్నాను. కానీ, రేపు మోడీ దీనికి కూడా నేను వ్య‌తిరేకం అని చెప్పే అవ‌కాశం ఉంది. మోడీ.. భార‌త్ బైడెన్‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు`` అని రాహుల్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.