Begin typing your search above and press return to search.

వరంగల్ కు రాహుల్.. సడన్ గా ప్రయివేటు ప్రోగ్రాం?

రాహుల్‌ గాంధీ మంగళవారం సాయంత్రం హనుమకొండలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి తొలుత హైదరాబాద్‌ చేరుకునే రాహుల్.. అనంతరం హెలికాప్టర్‌ లో హనుమకొండ వెళ్తారు.

By:  Tupaki Desk   |   11 Feb 2025 6:55 AM GMT
వరంగల్ కు రాహుల్.. సడన్ గా ప్రయివేటు ప్రోగ్రాం?
X

ఢిల్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని దిగమింగి.. ఆ వెంటనే ప్రజల్లోకి వస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. అది కూడా అనూహ్యంగా తమ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇటీవలే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని రాగా.. ఆ వెంటనే రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తుండడం గమనార్హం.

రాహుల్‌ గాంధీ మంగళవారం సాయంత్రం హనుమకొండలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి తొలుత హైదరాబాద్‌ చేరుకునే రాహుల్.. అనంతరం హెలికాప్టర్‌ లో హనుమకొండ వెళ్తారు. వాస్తవానికి తొలుత రాహుల్ పర్యటనను ప్రవేయిటు కార్యక్రమంగా పేర్కొన్నారు. అంతలోనే పార్టీ క్యాడర్ తోనూ సమావేశం అవుతారని చెబుతున్నారు.

రాత్రికి రైలులో తమిళనాడుకు..

మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు హనుమకొండలో కాంగ్రెస్ క్యాడర్ తో రాహుల్‌ సమావేశం కానున్నారు. ఆయన పర్యటన దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు హనుమకొండ పర్యటన అనంతరం రాహుల్‌ రాత్రి రైలులో తమిళనాడు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

తెలంగాణలో ఇటీవల ప్రభుత్వం, అధికార కాంగ్రెస్ పార్టీ పరంగా పలు ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేను ఆ పార్టీ నేతలే వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. స్వయంగా రాహుల్ గాంధీనే లోక్ సభలో తమ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో కుల గణనను విజయవంతంగా చేసిందని చెప్పుకురాగా.. తెలంగాణలో మాత్రం దానికి భిన్నమైన స్వరాలు వినిపించాయి. అంతేగాక ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లినా కాంగ్రెస్ అగ్ర నాయకుడైన రాహుల్ ను కలవలేదు. ఆయన అపాయింట్ మెంట్ కోరనే లేదని రేవంత్ వివరణ ఇచ్చారు. ఇక కేంద్ర పన్నుల్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందంటూ రేవంత్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటుకు పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలోనే రాహుల్ తెలంగాణ, తమిళనాడులకు రానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ రెండు రాష్ట్రాలకు పొరుగున ఉన్న, కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్న కర్ణాటకకు కూడా వెళ్తారా? అనేది చూడాలి. ఏమో..తెలంగాణ, తమిళనాడులలో ఆయన చేపట్టింది కూడా ఆకస్మిక పర్యటనే కదా..?