రోడ్డు మీద చెప్పులు కుట్టే వ్యక్తికి చెప్పిన మాటను నిలబెట్టుకున్న రాహుల్
దాదాపు ఎనిమిది నెలల క్రితం రోడ్డు మీద నిరుపేద చెప్పులు కట్టే వ్యక్తిని కలిసిన రాహుల్.. అతడి కుటుంబాన్ని తన ఇంటికి రావాలని ఆహ్వానించాడు.
By: Tupaki Desk | 20 Feb 2025 8:30 AM GMTరాజకీయంగా ఎప్పుడు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించే విషయంలో తరచూ తప్పులు చేసే రాహుల్ గాంధీ.. కొన్ని విషయాల్లో మాత్రం మనసుల్ని దోచుకునేలా వ్యవహరిస్తుంటారు. నిజానికి ఆయనలో బలమైన రాజకీయ నాయకుడైన మనిషి కంటే.. మానవత్వం, దయ ఉన్న వ్యక్తిగా వ్యవహరిస్తారు. దీనికి తోడు ఆయనకున్న టాలెంట్లు అన్నీ ఇన్ని కావు. తాను ఎవరికైనా ఏమైనా మాట ఇస్తే.. దాన్ని పూర్తి చేయటంలోనూ ముందుంటారు.
దాదాపు ఎనిమిది నెలల క్రితం రోడ్డు మీద నిరుపేద చెప్పులు కట్టే వ్యక్తిని కలిసిన రాహుల్.. అతడి కుటుంబాన్ని తన ఇంటికి రావాలని ఆహ్వానించాడు. ఆయన చెప్పినట్లే.. తన సిబ్బందికి చెప్పి.. ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పుర్ కు చెందిన సదరు చెప్పులుకుట్టే కుటుంబాన్ని ఢిల్లీకి తన ఇంటికి వచ్చేలా చేశారు. వారికి అవసరమైన టికెట్లు ఏర్పాటు చేయటంతో పాటు.. వారు ఢిల్లీకి చేరుకున్నంతనే కారును పంపి.. వారిని తన ఇంటికి సాదరంగా పిలిపించుకున్నారు.
గత ఏడాది జులైలో తన యూపీ పర్యటనలో రామ్ చేతనే అనే చర్మకారుడి వద్ద చెప్పులు తయారు చేయించుకున్న రాహుల్.. కుటుంబ సమేతంగా తన ఇంటికి రావాలని కోరారు. 60 ఏళ్ల రామ చేతన్.. తన కొడుకు.. మనమడు.. కుమార్తె.. అల్లుడ్ని తీసుకొని ఢిల్లీకి వచ్చారు. రాహుల్ నివాసానికి వెళ్లిన వారు దాదాపు గంట పాటు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా పలు అంశాల్ని వారితో మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
రాహుల్ నివాసం నుంచి బయటకు వచ్చిన వారు.. తమకు ఎదురైన అనుభవాన్ని చెప్పుకొచ్చారు. ఇంటికి వెళ్లిన తమకు.. ఎదురొచ్చి మరీ.. తనకు స్వాగతం పలకటమే కాదు అప్యాయంగా హత్తుకున్నట్లుగా చెప్పారు. ‘అక్కడే ప్రియాంకా గాంధీ ఉన్నారు. కాసేపటికి సోనియా గాంధీ వచ్చారు. వారంతా గంట పాటు మాతో గడిపారు. ముగ్గురికి నేను తయారు చేసిన చెప్పులు అందించా. నా కొడుక్కి డిల్లీలో బూట్లు తయారీకి సంబంధించిన ట్రైనింగ్ ఇప్పిస్తానని రాహుల్ చెప్పారు. ఆ తర్వాత విదేశాలకు పంపుతానని చెప్పారు’’ అని ఆనందంగా చెప్పుకొచ్చారు.
గత ఏడాది రాహుల్ తనను కలిసిన తర్వాత.. మోడ్రన్ కుట్టుమిషన్ తో పాటు.. కొంత మెటీరియల్ ను పంపిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మొత్తంగా తాను ఇచ్చిన మాటకు తగ్గట్లు..నిరుపేద కుటుంబాన్ని కలవటం.. వారిని అప్యాయంగా చూసుకోవటం లాంటివి చూసినప్పుడు ఆయన మనసు ఎలాంటిదో అర్థమవుతుందని చెప్పాలి.