రాహుల్ సపోర్టుతోనే రేవంత్ హైడ్రాను తీసుకొచ్చాడా..?
గత దశాబ్దాల కాలంగా హైదరాబాద్ మహానగరం ఎంత విధ్వంసానికి గురైందో తెలిసిందే.
By: Tupaki Desk | 3 Sep 2024 5:09 AM GMTగత దశాబ్దాల కాలంగా హైదరాబాద్ మహానగరం ఎంత విధ్వంసానికి గురైందో తెలిసిందే. ఎక్కడికక్కడా అక్రమార్కులు ఇష్టారాజ్యంగా భూముల కబ్జాలకు పాల్పడుతూ.. ఇండ్ల నిర్మాణం చేపట్టారు. చెరువులు, కుంటలు అంటూ దేనినీ వదలకుండా ఆక్రమించే అమ్మేశారు. ఒకప్పుడు నగరం చుట్టూ పదుల సంఖ్యలో ఉండే చెరువులు, కుంటలు ఇప్పుడు మచ్చుకైనా కనిపించకుండా పోయాయి. ఎక్కడ చూసినా భవంతులే వెలిశాయి.
గత ప్రభుత్వం కబ్జాలను పెద్దగా పట్టించుకోలేదు. అంతేకాదు.. కొందరిని ప్రోత్సహించినట్లుగానూ వారిపై ఆరోపణలు ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే.. గత ప్రభుత్వంలోనే పెద్దలే చాలా వరకు కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టినట్లు గానూ టాక్ ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొందరు మాజీ మంత్రులు, బడా నేతలు అక్రమంగా ఆక్రమించి పెద్దపెద్ద భవనాలు నిర్మించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దాంతో వాటి జోలికి పోకుండా గత పాలకులు పాలన కొనసాగించారు.
ఇప్పుడు సీన్ రివర్స్.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో ఇప్పుడు ఆయన కబ్జాలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. చెరువులు, కుంటలను కాపాడేందుకు యుద్ధమే చేస్తున్నారు. అందులో భాగంగా అక్రమ నిర్మాణాల భరతం పట్టేందుకు హైడ్రా ఏర్పాటు చేశారు. దానికి కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ రంగనాథ్‌ను నియమించారు. ఇప్పటికే తన కార్యకలాపాలు ప్రారంభించిన హైడ్రా.. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను సైతం నేలమట్టం చేసి మరింత సంచలనమైంది. ఇప్పుడు అక్రమార్కుల గుండెల్లో హైడ్రా రైళ్లు పరిగెత్తిస్తోంది.
పార్టీలకతీతంగా.. ఎవరు కబ్జాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని హైడ్రాకు సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. చివరకు సొంత అన్న ఇల్లు సైతం ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని తెలిస్తే ఆయనకూ నోటీసులు జారీ చేశారు. దీంతో ఇప్పుడు కబ్జాదారులు అయోమయంలో పడ్డారు. ఎప్పుడు ఎవరికి నోటీసు వస్తుందా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే.. అక్రమ కట్టడాలు, కబ్జాలపై ముఖ్యమంత్రి రేవంత్ ఇంత దూకుడుగా వ్యవహరించడం వెనుక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన మద్దతుతోనే రేవంత్ హైడ్రాను అమల్లోకి తీసుకొచ్చి.. అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారట.
ఇందుకు కారణాలూ లేకపోలేదు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకే చెందిన సీనియర్ నాయకుడు పల్లం రాజు స్వయానా హైడ్రా బారిన పడ్డాడు. ఆయన సోదరుడు ఆనంద్‌కు చెందిన ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజీని హైడ్రా కూల్చివేసింది. అలాగే.. హిమాయత్ సాగర్ ఎఫ్‌టీఎల్ సమీపంలో చేపట్టిన కూల్చివేతలు సైతం వివాదానికి దారితీశాయి. అయితే.. వీటన్నింటినీ పల్లం రాజు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. రాహుల్‌గాంధీకి జరిగిన విషయాన్ని వివరించారు.
కానీ.. రాహుల్ మాత్రం ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే మద్దతుగా నిలిచారు. ఆపరేషన్‌లో హైడ్రా విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సున్నితంగా చెప్పారట. అంతేకాదు.. రేవంత్ ఓ విజన్‌తో పాలన సాగిస్తున్నారని, అక్రమ కట్టడాల విషయంలో కఠినంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులను ప్రభావితం చేయడం సహజమేనని చెప్పుకొచ్చారట. హైడ్రా విషయంలో రేవంత్‌కు కాంగ్రెస్ అగ్రనేత సపోర్టు దొరకడంతో ముందు ముందు మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశాలూ లేకపోలేదు.