రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం...పొగిడారా ?
సోషల్ మీడియా ద్వారా కూడా రాహుల్ ని పప్పు అంటూ వేళాకోళం చేస్తూ వచ్చింది.
By: Tupaki Desk | 9 Sep 2024 7:30 PM GMTకాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ మీద చాలా రకాలుగా సొంత పార్టీ వారు బయట వారూ మాట్లాడుతూంటారు. రాహుల్ గాంధీని పప్పు అని ప్రత్యర్ధులు ఎక్కువగా ర్యాంగింగ్ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా బీజేపీ అయితే రాహుల్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి పదే పదే ఇదే మాటను వాడింది. జనాల్లోకి ఇదే పంపించింది. సోషల్ మీడియా ద్వారా కూడా రాహుల్ ని పప్పు అంటూ వేళాకోళం చేస్తూ వచ్చింది.
అయితే రాహుల్ పప్పు కాదు అని ఇటీవల ఆయన ప్రసంగాలు కానీ ఆయన వ్యవహార శైలి కానీ ప్రతిపక్ష నాయకుడిగా లోక్ సభలో అధికార బీజేపీ కూటమిని ఆయన నిలదీస్తున్న వైఖరిని చూసిన వారు కానీ కచ్చితంగా అర్ధం చేసుకున్నారు. ఆ విధంగా తన మీద వేసిన ఈ బురదను రాహులే తొలగించుకున్నారు అని భావించాలి. ఆయన చేసిన భారీ పాదయాత్ర కూడా అందుకు ఉపకరించింది అని చెప్పాలి.
ఇదిలా ఉంటే రాహుల్ ఈ నెల 8 నుంచి 10 వరకూ మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా ఎన్నారైలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. టెక్సాస్ లోని డాలస్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ కు పెద్ద ఎత్తున అందరి నుంచి స్వాగతం లభించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్నారై విభాగం కన్వీనర్ అయిన శ్యాం పిట్రోడా రాహుల్ గాంధీని రిసీవ్ చేసుకున్నారు.
అనంతరం డాలస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ శామ్ పిట్రోడా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పప్పు కాదు అని అన్నారు. బీజేపీ ఈ విషయంలో రాహుల్ గాంధీ మీద తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
అంతే కాదు కోట్లు కుమ్మరించి మరీ బీజేపీ రాహుల్ గాంధీని కించపరచే కార్యక్రమానికి తెర తీసిందని నిందించారు. నిజానికి రాహుల్ గాంధీ ఉన్నత విద్యావంతుడు అని ఆయన కితాబు ఇచ్చారు. ఆయన ఎంతో చదువుకున్నారని అంతే కాదు లోతైన ఆలోచనాపరుడని శ్యాం పిట్రోడా చెప్పారు. రాహుల్ ఆలోచనల లోతును ఒక్కోసారి అర్థం చేసుకోలేమని కూడా ఆయన అన్నారు. రాహుల్ ని ఎగతాళీ చేసే వారికి ఆయన అసలు అర్ధం కారని అన్నారు. రాహుల్ గాంధీలో పరిపక్వత సాధించిన నాయకత్వం ఉందని అన్నారు. రాహుల్ గాంధీ రాజకీయంగా ఎంతో రాటు దేలారు అని కూడా అన్నారు.
మొత్తం మీద శ్యాం పిట్రోడా రాహుల్ గాంధీ మీద చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. రాహుల్ పప్పు కాదని అంటూనే ఆయనను అర్ధం చేసుకోవడం ఒక్కోసారి కష్టం అని కూడా అన్నారు ఇది నిజంగా పొగడ్తగానే చూసినా అందులో కూడా అర్ధాలు చూసేవారు ఉంటారని అంటున్నారు. ఏది ఏమైనా భావి భారత దేశ నాయకుడిగా రాహుల్ ఇపుడు అగ్ర భాగంలో ఉన్నారని కాంగ్రెస్ నేతలతో పాటుగా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.