Begin typing your search above and press return to search.

వ్యూహం మార్చిన రాహుల్.. కేసీఆర్ ను సరికొత్తగా టార్గెట్

వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్న దానికి తగ్గట్లే.. తాజాగా రాహుల్ తాను చేస్తున్న బస్సు యాత్ర సందర్భంగా కొత్త వ్యూహానికి తెర తీశారు.

By:  Tupaki Desk   |   21 Oct 2023 6:09 AM GMT
వ్యూహం మార్చిన రాహుల్.. కేసీఆర్ ను సరికొత్తగా టార్గెట్
X

అంచనాలకు తగ్గట్లు వ్యూహాలు రూపొందిస్తే ఎన్నికల వేళ మజా ఏముంటుంది? అందునా మైండ్ గేమ్ లో కాకలు తిరిగిన కేసీఆర్ లాంటి నాయకుడ్ని ఢీ కొనేందుకు.. ఆయన బాటలోనే నడవాల్సి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ అదే తీరును ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ఆరు హామీలతో కొత్త చర్చకు తెర తీసిన కాంగ్రెస్ ను టార్గెట్ చేసే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రులు కేటీఆర్.. హరీశ్ లు పెద్ద ఎత్తున శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఆగమాగం అవుతుందని హెచ్చరిస్తున్నారు.

ఇదే సమయంలో పదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేస్తున్న పనులు చిట్టా చెబుతూ.. తెలంగాణకు తామెంత మేలు చేశామన్న విషయాన్ని గొప్పగా చెబుతున్నారు. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్న దానికి తగ్గట్లే.. తాజాగా రాహుల్ తాను చేస్తున్న బస్సు యాత్ర సందర్భంగా కొత్త వ్యూహానికి తెర తీశారు.

పదేళ్ల కాలంలో తాము చాలా చేశామని చెబుతున్న కేసీఆర్.. కేటీఆర్ మాటలక కౌంటర్ గా ఆయన కొత్త హామీల్ని ఇస్తున్నారు. ఇప్పటివరకు పరిష్కారం కాని అంశాల్ని ప్రస్తావిస్తూ.. వాటిని తమ ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే చేస్తామని మాట ఇస్తున్నారు.

ఈ హామీల్లో భాగంగా.. రాష్ట్రంలో మూతపడిన చక్కెర కర్మాగారాల్ని తెరిపిస్తామని.. పసుపు ధర క్వింటాలుకు రూ.12-15 వేల వరకు ఇప్పిస్తామని.. ఛత్తీస్ గఢ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యాన్ని కింట్వాలు రూ.2500లకు కొనుగోలు చేస్తుందని చెప్పుకొచ్చారు.

ఇలా.. చాలా చేశామని చెబుతున్న కేసీఆర్ కు.. వారి ప్రభుత్వంలో ఏమేం చేయలేదన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా రాహుల్ వ్యూహాత్మకంగా హామీలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. చాలా చేశామని చెప్పే కేసీఆర్ కు.. ఏమేం చేయాల్సి ఉందో చెబుతున్న రాహుల్ ఎత్తుగడ ఏ మేరకు సక్సెస్ అవుతుందో ఎన్నికల తుది ఫలితం స్పష్టం చేస్తుందని చెప్పాలి.