Begin typing your search above and press return to search.

ఐశ్వర్యరాయ్ పై రాహుల్... సిద్ధరామయ్యను తగులుకున్న బీజేపీ!

ఈ రోజుల్లో నేతలు చేసే కామెంట్లు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని అనకపోతే.. వాటిపై రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తాయి.

By:  Tupaki Desk   |   22 Feb 2024 7:51 AM GMT
ఐశ్వర్యరాయ్  పై రాహుల్... సిద్ధరామయ్యను తగులుకున్న బీజేపీ!
X

ఈ రోజుల్లో నేతలు చేసే కామెంట్లు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని అనకపోతే.. వాటిపై రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తాయి. దీంతో ఆ కామెంట్లు కాస్తా బౌన్స్ బ్యాక్ అవుతుంటాయి. ఇదే సమయంలో చెప్పే విషయంలోనూ, చేసే విమర్శల్లోనూ కూడా స్పష్టత కరువైనా ఇవే ఫలితాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో ఇటీవల రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రిని తగులుకుంది బీజేపీ. దీంతో ఇప్పుడు ఇష్యూ వైరల్ గా మారింది.

అవును... అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం, నటి ఐశ్వర్యారాయ్ పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ.. సిద్ధరామయ్యను టార్గెట్ చేసింది. వివరాళ్లోకి వెళ్తే... ప్రస్తుతం రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అయోధ్యలో ఇటీవల జరిగిన రామ మందిర ప్రాణప్రతిష్ఠ గురించి మాట్లాడుతూ.. ఐశ్వర్యా రాయ్ ప్రస్థావన తెచ్చారు.

ఇందులో భాగంగా... "మీరు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూశారా? అక్కడ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన ఒక్క వ్యక్తి అయినా కనిపించారా? అమితాబ్‌ బచ్చన్‌, ఐశ్వర్యరాయ్‌, నరేంద్రమోడీ వంటివారు మాత్రమే ఉన్నారు" అని బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో... బిలియనీర్లు, బాలీవుడ్‌ ప్రముఖులు మాత్రమే ఆ వేడుకలో ఉన్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో గతంలోనూ ఒకసారి... "టీవీ ఛానెళ్లు ఐశ్వర్యరాయ్ డ్యాన్సులను మాత్రమే చూపిస్తున్నాయి. పేదప్రజల స్థితిగతులను గురించి మాత్రం ఎలాంటి ప్రసారాలు చేయడం లేదు" అని అన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆయన తన ప్రవర్తనతో మరింత దిగజారిపోయారంటూ విరుచుకుపడింది. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ప్రశ్న సంధించింది.

ఇందులో భాగంగా... "రాహుల్‌ గాంధీ తీవ్ర నిరాశలో ఉన్నారు. అందుకే దేశం గర్వించే ఐశ్వర్యరాయ్‌ ను కించపరిచే స్థాయికి దిగజారారు. గాంధీ కుటుంబానికి మించి దేశానికి కీర్తి సంపాదించిన పెట్టిన ఐశ్వర్యపై ఎలాంటి ఘనతలు సాధించని రాహుల్‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. సిద్ధరామయ్య జీ.. మీ బాస్ మీ తోటి కన్నడిగులను అవమానిస్తున్నారు. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తారా? లేక.. కుర్చీ కోసం మౌనంగా ఉండిపోతారా?" అని కర్ణాటక బీజేపీ ఎక్స్‌ వేదికగా ఫైరయ్యింది.

దీంతో... గాంధీ కుటుంబం కంటే ఐశ్వర్యారాయ్ దేశానికి ఎక్కువ కీర్తి ప్రతిష్టలు తెచ్చిందంటూ బీజేపీ వ్యాఖ్యానించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు! ఇదే సమయంలో నూతన పార్లమెంట్ భవనం, అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలకు రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించలేదో బీజేపీ నేతలు సూటిగా చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నారు! ఏది ఏమైనా... ఈ విషయంపై నెట్టింట రసవత్తర చర్చ మొదలైంది!