రాహుల్ రావణా... బీజేపీ మార్ఫింగ్ ఫోటో!
రాజకీయాల్లో విమర్శలూ ప్రతి విమర్శలూ అత్యంత సజహం అయినప్పటికీ... కొన్ని సందర్భాల్లో కొంతమంది మరీ దిగజారిపోయి విమర్శలు చేస్తుంటారని అంటుంటారు
By: Tupaki Desk | 6 Oct 2023 5:49 AM GMTరాజకీయాల్లో విమర్శలూ ప్రతి విమర్శలూ అత్యంత సజహం అయినప్పటికీ... కొన్ని సందర్భాల్లో కొంతమంది మరీ దిగజారిపోయి విమర్శలు చేస్తుంటారని అంటుంటారు. ఆ సంగతి కాసేపు పక్కనపెడితే... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాహుల్ గాంధీని మరోసారి టార్గెట్ చేసింది. అది కూడా పక్కా ప్లానింగ్ తో అన్నట్లు... నెటిజన్స్ ట్రోల్ చేసినట్లు!
అవును.... భారతీయ జనతాపార్టీ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్ లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మార్ఫింగ్ పోస్టర్ ను పోస్టు చేసింది. ఈ పోస్టర్ లో రాహుల్ గాంధీని పది తలల రావణాసురుడిగా చిత్రీకరించింది. దీంతో ఈ పోస్ట్ కం పోస్టర్ వివాదాస్పదమైంది. ఆ పోస్టర్ పై "రావణ్, ఎ కాంగ్రెస్ పార్టీ ప్రొడెక్షన్.. దర్శకత్వం జార్జ్ సోరోస్" అని రాసిన టైటిల్స్ ఉన్నాయి.
భారతీయ జనతా పార్టీ ఇటీవలి కాలంలో జార్జ్ సోరోస్ ను లక్ష్యంగా చేసుకుంటోందనే విషయం తెలిసిందే. ప్రఖ్యాత హంగేరియన్ - అమెరికన్ వ్యాపారవేత్త. ఈయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ గ్రూప్ లకు భారీ విరాళాలు ఇస్తూ.. ఆయా దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారని కాషాయపార్టీ ఆరోపణ.
ఈ నేపథ్యంలోనే... "కొత్త యుగం రావణుడు ఇక్కడ ఉన్నాడు.. అతడో రాక్షసుడు.. ధర్మానికి వ్యతిరేకి.. రాముడికి వ్యతిరేకి.. భారత్ ను నాశనం చేయడమే అతడి లక్ష్యం" అంటూ భారతీయ జనతాపార్టీ తన ట్విటర్ లో పోస్టు పెట్టింది. ఇలా రాహుల్ గాంధీని రావణుడిగా చిత్రీకరించడం.. దానికి దర్శకుడు జార్జ్ సోరస్ అని పేర్కొనడం వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
అవును... రాహుల్ గాంధీని రావణుడిగా చిత్రీకరించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందించారు. హింసను ప్రేరేపించడానికి, రెచ్చగొట్టడానికే బీజేపీ రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకొని ఇలాంటి పోస్టు పెట్టిందని ఆయన ఫైరయ్యారు. ఇదే సమయంలో బీజేపీ అధికారిక ట్విటర్ హ్యాండిల్ లో రాహుల్ గాంధీని రావణుడిగా చిత్రీకరించిన ఈ దారుణమైన గ్రాఫిక్ వెనుకున్న అసలు ఉద్దేశం ఏమిటి? అని సూటిగా ప్రశ్నించారు.
ఇదే సమయంలో ఇది స్పష్టంగా హింసను ప్రేరేపించి, రెచ్చగొట్టడానికి చేసిన ప్రయత్నం అని అభిప్రాయపడిన ఆయన... మా పార్టీ మాజీ అధ్యక్షుడి తండ్రి, నానమ్మ... దేశాన్ని విభజించాలనుకునే శక్తుల చేతుల్లో హత్యకు గురయ్యారని జైరాం రమేష్ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్రమోడీ తన పార్టీని ఇలాంటి పనులు చేయమని ప్రోత్సహించడం ఆమోదయోగ్యం కాదని, వాటికి తాము భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.