Begin typing your search above and press return to search.

రాహుల్ అండ్ లోకేష్ : ఫ్యూచర్ త్రీడీలో కనిపిస్తోందా ?

దానికి తగినట్లుగా కాంగ్రెస్ 2014, 2019లలో ఓటమి పాలు అయింది మరీ తీసికట్టుగా పరిస్థితి మారింది.

By:  Tupaki Desk   |   17 July 2024 8:30 AM GMT
రాహుల్ అండ్ లోకేష్ :  ఫ్యూచర్ త్రీడీలో కనిపిస్తోందా ?
X

కేంద్రంలో రెండు సార్లు యూపీయేని అధికారంలోకి తెచ్చిన కాంగ్రెస్ అగ్ర నేత మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన కుమారుడిని వారసుడిగా తీర్చిదిద్దలేకపోయారు అని విమర్శలు వచ్చాయి. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయలేకపోయారు అని కూడా అన్నారు. రాహుల్ గాంధీని పప్పు అని గేలి చేసారు. రాహుల్ గాంధీలో అసలు వారసత్వం తప్ప జవసత్వం లేదని బీజేపీ నేతలు అదే పనిగా నోరు పడేసుకున్నారు.

దానికి తగినట్లుగా కాంగ్రెస్ 2014, 2019లలో ఓటమి పాలు అయింది మరీ తీసికట్టుగా పరిస్థితి మారింది. లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షం అన్నది కూడా దక్కలేదు. దానికి తోడు వరస విజయాలతో బీజేపీ మధ్యాహ్న మార్తాడుడి మాదిరిగా ఉంది. ఆ టైం లో రాహుల్ గాంధీ ఏది మాట్లాడినా తప్పే అన్నట్లుగా బీజేపీ నేతలు వ్యవహరించారు. ఆయనకు గాంధీ కుటుంబీకుడు అన్న అర్హత తప్ప మరేమీ లేదని కూడా ఎకసెక్కమాడారు.

అయితే 2019 నుంచి 2024 మధ్యలో రాహుల్ ఎదిగిగిన తీరు తనను తాను మార్చుకున్న విధానం ఎంతో స్ఫూర్తి వంతంగా ఉంది. రాహుల్ పార్టీ జనం తో కాదని చెప్పి సామాన్య జనంతో కలిసిపోయారు. భారత్ జోడో యాత్రను రెండు సార్లు చేసి సగానికి పైగా దేశాన్ని తన పాదాలతో కలిపేశారు. ఆయన ఈ యాత్రల ద్వారా ఎంతో నేర్చుకున్నారు. అలాగే ఆయనకు జనాలు ప్రేరణ అయితే రాహుల్ కూడా జనాలకు కొత్త నాయకుడిగా కనిపించారు.

దాని ఫలితాలే లోక్ సభ ఎన్నికల నుంచి తాజాగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల దాకా కనిపిస్తున్నాయి. దాదాపుగా అధికారానికి దగ్గరగా ఇండియా కూటమి వచ్చేసింది. ఇక రాహుల్ గాంధీ స్పీచ్ లో పదును పెరిగింది. ఆయన వ్యూహాలలో జోరు పెరిగింది. రాహుల్ అంటే పప్పు కాదు నిప్పు అని బీజేపీ పెద్దలకు స్పష్టం చేస్తున్నారు. ఆయన్ని ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ గా ఇండియా కూటమి మిత్రులు సైతం అంగీకరించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

మరో వైపు చూస్తే ఏపీలో నారా లోకేష్ కూడా అలాగే ఎదిగారు. పప్పు అంటూ ఆయన్ని గేలి చేసిన చోటనే ప్రత్యర్ధులను ఓడించి మరీ గెలిచారు. ఆయన మంగళగిరిలో అధ్బుత విజయాన్ని అందుకున్నారు. అంతే కాదు యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. అది కూడా జనాలతో లోకేష్ కి కొత్త బంధం వేసింది. అలాగే టీడీపీలో చంద్రబాబు తరువాత నేతగా లోకేష్ ని పార్టీ జనాలకు చూపించింది.

లోకేష్ కొంతకలం క్రితం చేసిన ప్రసంగాలలో తడబాట్లూ పొరపాట్లు ఉన్నాయి కానీ ఇపుడు ఆయన బాగానే రాటు దేలారు. చంద్రబాబు ఉద్ధండుడు అయినా తన కుమారుడిని తీర్చిద్దలేకపోయారు అన్న అపవాదు ని లోకేష్ తొలగించారు చంద్రబాబుకు ధీటుగా ఎదుగుతూ తండ్రికి వారసుడు అనిపించుకుంటున్నారు. టీడీపీకి మరింత కాలం నాయకత్వం వహించేలా లోకేష్ లీడర్ షిప్ క్వాలిటీస్ ని పెంచుకుంటున్నారు.

మొత్తం మీద నవ్విన నాప చేనే పండింది అని సామెత. అలా దేశంలో రాహుల్ గాంధీ ఏపీలో నారా లోకేష్ ప్రత్యర్ధులు విమర్శలు చేసిన చోటనే ఆగిపోకుండా తామేంటో రుజువు చేసుకున్నారు. 2029 నాటికి తమ ఇద్దరికీ గోల్డెన్ ఫ్యూచర్ ఉందని రుజువు చేసుకుంటూ ధీమాగా ముందుకు సాగుతున్నారు. ఒకనాడు సెటైర్లువేసిన బీజేపీ వైసీపీ ఈ ఇద్దరు నేతలను చూసి ఆశ్చర్యపోయేలా వారి పొలిటికల్ గ్రాఫ్ అంతకంతకు పైకే ఎగబాకుతోంది అంటే అతిశయోక్తి కాదు అని అంటున్నారు.