Begin typing your search above and press return to search.

పద్మవ్యూహం పోలికతో కమలనాథులకు మంటెక్కించిన రాహుల్ !

రైతులు యువత మహిళలు బడుగులు వంటి వర్గాలు ఈ పద్మవ్యూహంలో చిక్కుకుని బయటకు రాలేకపోతున్నారు అని రాహుల్ గాంధీ అన్నారు.

By:  Tupaki Desk   |   29 July 2024 3:55 PM GMT
పద్మవ్యూహం పోలికతో కమలనాథులకు మంటెక్కించిన రాహుల్ !
X

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన ప్రసంగాలలో రాటు తేలుతునందారు. బడ్జెట్ మీద ప్రసంగాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ అధికార పక్షాన్ని గట్టిగానే నిలదీశారు. మహాభారతంలో అభిమన్యుడిని పద్మవ్యూహం తో ఆరుగురు ఆనాడు కంట్రోల్ చేశారని ఆధునిక మహాభారతంలో పద్మవ్యూహాన్ని పన్ని బీజేపీలో ఆరుగురు కంట్రోల్ చేస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.

ఆ ఆరుగురు ఎవరూ అంటే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఆరెస్సెస్ చీఫ్ భగవత్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, పారిశ్రామిక వేత్తలు అయిన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీగా ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు.

వీరంతా కలసి పన్నిన పద్మవ్యూహంలో దేశ ప్రజలు చిక్కుకుని పోయారని రాహుల్ గాంధీ అన్నారు. రైతులు యువత మహిళలు బడుగులు వంటి వర్గాలు ఈ పద్మవ్యూహంలో చిక్కుకుని బయటకు రాలేకపోతున్నారు అని రాహుల్ గాంధీ అన్నారు.

అంతటితో ఆగని ఆయన నాటి పద్మవ్యూహానికి ఈనాటి బీజేపీ ఎన్నికల గుర్తు కమలానికి మంచి పోలిక ఉందని కూడా సెటైర్లు వేశారు. ఇక ఆయన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కూడా వదలేదు. ఆమె బడ్జెట్ లో పేదలకు బడుగులకు బీసీలు ఓబీసీలకు చోటు ఉందా అని నిలదీశారు.

బీజేపీ ఏలుబడిలో అన్ని వర్గాల ప్రజానీకం సతమతమవుతున్నారని రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ గుత్తాధిపత్యం తో దేశాన్ని గుప్పిట పెట్టాలని చూస్తోందని అన్నారు. తన చేతిలలో ఉన్న సీబీఐ ఈడీ, ఆదాయపు పన్ను శాఖలను ఆధారం చేసుకుని బీజేపీ పద్మవ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేస్తోందని అన్నారు

తాము మరో స్వాతంత్ర్య పోరాటం ద్వారా బీజేపీ పద్మ వ్యూహాలను తిప్పికొడతామని రాహుల్ గాంధీ స్పస్ఠం చేశారు. దేశానికి మహా శివుడు ఆశీస్సులు ఉన్నాయని ఆయన అన్నారు. అందువల్ల దేశ ప్రజలను ఈ తరహా వ్యూహాలతో ఎవరూ ఓడించలేరని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే పురాణ పురుషులను పురాణ గాధలను తన సొంతం చేసుకుని రాజకీయంగా సమయానుకూలంగా వాటిని ఉపయోగించుకుంటూ వస్తున్న బీజేపీకే మహా భారతాన్ని మహా శివుడిని ముందు పెట్టి రాహుల్ చేస్తున్న కామెంట్స్ మింగుడు పడనివిగానే ఉన్నాయని అంటున్నారు.

అంతే కాదు రాహుల్ సైతం పురాణ పురుషుల పేర్లు చెబుతూ వారు ఈ దేశ ప్రజలకు అండగా ఉన్నారని అనడమూ విశేషం. గత సమావేశాల్లోనూ రాహుల్ గాంధీ ఇలాగే పురాణాల గురించి చెబుతూ వచ్చారు. ఇవన్నీ చూస్తూంటే రాహుల్ గాంధీ రాటు దేలిపోయారు అని అంటున్నారు. ఆయన ప్రసంగాలను గట్టిగా తిప్పి కొట్టే విరుగుడు మంత్రం బీజేపీ వద్ద ఉందా అన్నదే చూడాలని అంటున్నారు.