లోక్ సభలో మోడీని ఇరికించిన రాహుల్ ?
అధికార పక్షాన్ని తన మాటలతో చెడుగుడు ఆడుకున్నారు. దేవుడు చెబితేనే దేశంలో మోడీ విధ్వంసకర పాలన చేస్తున్నారా అని కూడా విమర్శించారు.
By: Tupaki Desk | 1 July 2024 3:20 PM GMTరాహుల్ గాంధీ లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో చేసిన తొలి ప్రసంగం రాజకీయ ప్రకంపనలు పుట్టించింది అని చెప్పాలి. విపక్ష సభ్యులు అంతా హుషారు చేస్తూ బల్లలు చరుస్తూ రాహుల్ ప్రసంగం ఆద్యంతం ఆందించారు. అదే టైంలో అధికార ఎన్డీయే కూటమి నుంచి నిరసనలు వినిపించాయి. అయితే అనేకసార్లు మధ్యలో స్పీకర్ జోక్యం చేసుకుంటూ రాహుల్ దూకుడు ప్రసంగం మీద అభ్యంతరం చెప్పారు.
అయినా సరే రాహుల్ గాంధీ తాను ఏదీ ఆరోపించడం లేదని ప్రధాని మోడీ స్వయంగా అన్న మాటలనే సభకు చెబుతున్నాను అని ప్రసంగం కొనసాగించారు. ఇంతకీ రాహుల్ అన్నదేంటి అంటే దేవుడి తోనే తనకు కనెక్షన్ ఉందని మోడీ ఎన్నికల సభలలో అన్న మాటలను గుర్తు చేశారు. ఆ పాయింట్ తోనే రాహుల్ గాంధీ మోడీని ఇరికించేశారు.
అధికార పక్షాన్ని తన మాటలతో చెడుగుడు ఆడుకున్నారు. దేవుడు చెబితేనే దేశంలో మోడీ విధ్వంసకర పాలన చేస్తున్నారా అని కూడా విమర్శించారు. మణిపూర్ దేశంలో భాగం కాదా మణిపూర్ మండిపోతూంటే ఎందుకు ప్రధాని మోడీ మాట్లాడలేదు, కనీసం అక్కడికి ఎందుకు వెళ్ళలేదు అని నిలదీశారు.
దేశంలో భిన్న వర్గాల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ పాలనా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ మార్క్ హిందూత్వను ఎద్దేవా చేశారు. ఫైజాబాద్ లో బీజేపీ ఓటమిని గుర్తు చేస్తూ అయోధ్య రాముడి ఆశీస్సులు ఎందుకు లేవు అని కూడా నిగ్గదీశారు. గడచిన పదేళ్ళుగా దేశంలో సాగిన మోడీ మొత్తం పాలనను విమర్శిస్తూ రాహుల్ ప్రసంగం సాగింది. పెద్ద నోట్ల రద్దును కూడా ఆయన ప్రస్తావించారు.
ఇదిలా ఉంటే సభలో శివుడు ఫోటోతో రాహుల్ మాట్లాడడం మీద బీజేపీ నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం అయింది. అయితే తాను ఏమీ అభ్యంతరమైన ఫోటోలు ప్రదర్శించలెదని రాహుల్ సమర్ధించుకున్నారు. కానీ దీని మీద ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.
అలాగే రాహుల్ గాంధీ రాజ్యాంగం ఫోటోను కూడా సభలో చూపించడం పట్ల బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను శివుడు ఫోటో రాజ్యాంగం ఫోటోను సభలో చూపిస్తే తప్పా అని రాహుల్ ప్రశ్నించారు. అంతే కాదు శివుడి నుంచి తాను ప్రేరణ పొందాను అని రాహుల్ చెప్పారు. రాజ్యాంగానికి రక్షణగా ఉంటాను అని ఆయన అన్నారు.
తాను ప్రతిపక్షంలో ఉన్నందుకు ఆనందిస్తున్నాను అని ఆయన అంటూ అధికారం కంటే నిజం గొప్పదని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ సీబీఐలతో ఇండియా కూటమి నేతలను వేధిస్తోందని ఆయన ఆరోపించరు. ఏకంగా రాజ్యాంగం మీదనే దాడి జరుగుతోందని ఆయన అన్నారు. నేరుగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనే ఇండియా కూటమి నేతలను టార్గెట్ చేస్తున్నారు అని రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు.
తన ఎంపీ పదవితో పాటు తన నివాసాన్ని కూడా లాక్కున్నారని తనను ఈడీ ముందు విచారణకు పిలిచి ఏకంగా 55 గంటల పాటు విచారించారని ఆయన గుర్తు చేశారు. తాను ప్రతిపక్ష నేతగా ఈ రోజు ఉండడాన్ని గర్విస్తున్నాను అని రాహుల్ చేసిన ఈ ప్రసంగం మాత్రం ఇండియా కూటమిని ఆందంలో ముంచెత్తగా బీజేపీ నేతలను తీవ్ర అసహనానికి గురి చేసింది. మొత్తానికి దేవుడికీ తనకు కనెక్షన్ అని మోడీ అన్నట్లుగా వచ్చిన వార్తలను ఆధారం చేసుకుని సభలో రాహుల్ సెటైర్లు వేస్తూ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది అనే చెప్పాలి.