అయోధ్య యాత్రకు కౌంటర్‌గా భారత్ యాత్ర.. టార్గెట్ సేమ్!
మార్చి చివరి వారంలో లేదా.. ఏప్రిల్ తొలివారంలో దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది.
By: Tupaki Desk | 1 Jan 2024 3:47 AM GMTమార్చి చివరి వారంలో లేదా.. ఏప్రిల్ తొలివారంలో దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. మొత్తం మూడు విడతల్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గత 2019లోనూ మూడు విడతల్లో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే షెడ్యూల్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే.. కీలకపార్టీలైన కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీల కూటమి ఇండియా, అటు బీజేపీ రెండూ కూడా ప్రచారంలో దూకుడు పెంచాయి.
అయితే.. మోడీ నేతృత్వంలోని బీజేపీ అయోధ్య యాత్రకు ప్రాధాన్యం ఇస్తోంది. దేశంలోని 82 శాతం పైగా ఉన్న హిందూ ఓట్లను తమవైపు ఆకర్షించేందుకు ఉత్తరప్రదేశలో నూతనంగా నిర్మించిన రామాలయాన్ని ఎన్నికల వనరుగా మార్చుకునే ప్రయత్నంలో ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అయోధ్య రామాలయాన్ని జనవరి 22న ప్రారంభించనున్న నేపథ్యంలో అప్పటి నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సంబరాలు చేయాలని మోడీ పిలుపునిచ్చారు.
వాస్తవానికి ఇప్పుడు నెల రోజుల ముందు నుంచే అయోధ్యకు సంబంధించిన వార్తలు, ఇంటింటి ప్రచా రం, వంటివి బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇంటింటికీ తిరుగుతోంది. కరపత్రాలుపంచుతోంది. మోడీ కారణంగానే భారతీయ ఆత్మ మేల్కొందని అమిత్ షా వంటి దిగ్గజ నాయకులు ప్రచారం చేస్తున్నారు. అంటే. మొత్తంగా అయోధ్య యాత్ర ద్వారా.. వచ్చే ఎన్నికల్లో మాస్టర్ ప్లాన్ వేసి. విజయం దక్కించుకునేం దుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
మరోవైపు.. కాంగ్రెస్ న్యాయ యాత్ర పేరుతో దూకుడుపెంచింది. ఈ దఫా రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్ర స్థానంలో భారత్ న్యాయ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. జనవరి 14 నుంచి 'న్యాయ యాత్ర``ను చేపట్టనున్నారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి యాత్ర ప్రారంభమై పశ్చిమాన మహారాష్ర వరకూ పాదయాత్ర జరుగనుంది. 67 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగి మార్చి 20వ తేదీన ముంబైలో ముగుస్తుంది.
14 రాష్ట్రల్లోని 85 జిల్లాల మీదుగా మొత్తం 6,200 కిలోమీటర్ల మేర సాగుతుంది. యాత్ర నాగాలాండ్, అసోం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిసా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల మీదుగా కొనసాగి మహారాష్ట్ర చేరుకుంటుంది. ఖచ్చితంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చే సమయానికి ఇది ముగియనుంది. దీంతో బీజేపీ అయోధ్య యాత్ర.. కాంగ్రెస్ న్యాయ యాత్రలకు ప్రాధాన్యం ఏర్పడింది.