Begin typing your search above and press return to search.

రాహుల్ ఈస్ బ్యాక్...కాంగ్రెస్ లో కొత్త సందడి!

చాలా రోజుల సస్పెన్స్ తర్వాత రాహుల్ గాంధీకి గుడ్ న్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   7 Aug 2023 7:08 AM GMT
రాహుల్ ఈస్ బ్యాక్...కాంగ్రెస్ లో కొత్త సందడి!
X

చాలా రోజుల సస్పెన్స్ తర్వాత రాహుల్ గాంధీకి గుడ్ న్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తాజాగా ఆయనకు సంబంధించిన మరో గుడ్ న్యూస్ తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని పార్లమెంటు పునరుద్ధరించింది.

అవును... మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసులో రాహుల్ గాంధీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పార్లమెంటు పునరుద్ధరించింది.

కాగా 2019లో క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ఓ ర్యాలీలో మాట్లాడిన రాహుల్ గాంధీ... మోడీ అనే పేరును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. దొంగ‌లకంద‌రికీ ఎందుకని ఆ ఇంటి పేరుంటుంది అని అన్నారు. దీంతో రాహుల్ వ్యాఖ్యల‌పై బీజేపీ నేత‌లు కోర్టుకు వెల్లారు. గుజరాత్ లోని సూరత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ సమయంలో.. ఆయ‌న‌ చేసిన వ్యాఖ్యల్లో తీవ్రమైన నేర‌ముంద‌ని సూర‌త్ కోర్టు భావించింది. ఆ త‌ర‌హా వ్యాఖ్యల‌కు అత్యంత తీవ్రమైన శిక్ష అయిన రెండేళ్ల జైలు శిక్షను రాహుల్ కు విధించింది! కోర్టు నిర్ణయం వెళ్లడించిన కొంత సేప‌టిలోనే లోక్ స‌భ స్పీక‌ర్ కార్యాల‌యం స్పందించింది. రాహుల్ గాంధీ ఎంపీ ప‌ద‌వికి అన‌ర్హత ను ప్రక‌టించింది.

రెండేళ్ల జైలు శిక్షను ఎదుర్కునే ఏ ప్రజాప్రతినిధీ చ‌ట్ట స‌భ‌ల్లోకి ప్రవేశానికి అన‌ర్హుడ‌నే నియ‌మాన్ని అనుస‌రించి రాహుల్ పై అనర్హత వేసినట్లు తెలిపింది. రాహుల్ ను ఎంపీ హోదా నుంచి డిస్మిస్ చేసింది. అనంతరం ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వ‌య‌నాడ్ నియోజకవర్గ లోక్ సభ సీటుకు ఖాళీని కూడా అనౌన్స్ చేసింది.

ఈ నేప‌థ్యంలో రాహుల్‌ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది. స్టే విధిస్తూ ఆదేశాలు వెల్లడించింది. గరిష్ఠ శిక్ష విధింపులో ట్రయల్‌ కోర్టు సరైన కారణం చూపించి ఉండాల్సిందని స‌ర్వోన్నత న్యాయ‌స్థానం అభిప్రాయపడింది.

దీంతో రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పార్లమెంటు తాజాగా పునరుద్ధరించింది. దీంతో రాహుల్ గాంధీ మళ్లీ ఎంపీగా మారారు. ఫలితంగా పార్లమెంట్ స‌మావేశాల్లో హాజ‌రవ‌డానికి అవ‌కాశం ద‌క్కింది. కాగా... మణిపూర్ అల్లర్లపై విపక్షాలు సంధించిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ఈ నెల 8 నుంచి 10 వరకూ జరగనున్న సంగతి తెలిసిందే!