Begin typing your search above and press return to search.

సరిగ్గా జీ 20 సదస్సు వేళ రాహుల్ ఉండేది అక్కడ....!

రాహుల్ గాంధీ ఐరోపా పర్యటనకు బుధవారమే బయల్దేరి వెళ్లారు. ఆయన మొత్తం ఆరు రోజుల పాటు ఈ పర్యటన చేస్తారు

By:  Tupaki Desk   |   6 Sept 2023 5:21 PM IST
సరిగ్గా జీ 20 సదస్సు వేళ రాహుల్ ఉండేది అక్కడ....!
X

భారతదేశానికి గర్వకారణం జీ 20 సదస్సు అని బీజేపీ గొప్పగా చెప్పుకుంటోంది. భారత్ కి నాయకత్వాన జరిగే ఈ సదస్సు ప్రపంచానికి దిశా నిర్దేశం చేస్తుందని, ఇది అరుదైన అద్భుతమైన అవకాశం అని బీజేపీ చాలా కాలంగా చెప్పుకుంటూ వస్తోంది.

జీ 20 సదస్సుకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 9, 10 తేదీలలో ఢిల్లీలో జీ 20 సదస్సు జరగనుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా జీ 20 సదస్సు జరుగుతుందని బీజేపీ నేతలు అంటున్నారు.

మరి ఇంతలా జీ 20 సదస్సు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూంటే ప్రధాన ప్రతిపక్షానికి చెందిన అగ్ర నాయకుడు. గాంధీ వంశీకుడు అయిన రాహుల్ ఆ టైం లో ఎక్కడ ఉంటారు, ఏమి చేస్తారు అంటే ఆయన దేశంలోనే ఉండరని తెలుస్తోంది.

రాహుల్ గాంధీ ఐరోపా పర్యటనకు బుధవారమే బయల్దేరి వెళ్లారు. ఆయన మొత్తం ఆరు రోజుల పాటు ఈ పర్యటన చేస్తారు. తిరిగి ఈ నెల 11న ఆయన దేశానికి చేరుకుంటారు.ఈ పర్యటనలో ఆయన న్యాయవాదులు, విద్యార్ధులు,భారత సంతతి వారితో మాట్లాడుతారు అని అంతున్నారు.

అదే విధంగా చూస్తే ఆయన బ్రెజిల్, హేగ్ లలో కూడా పర్యటించి న్యాయవాదులతో చర్చలు జరుపుతారు. ఇక ఆయన పారిస్ లో విద్యార్ధులతో మాట్లాడుతారు. అలా విదేశంలో రాహుల్ గడుపుతారు అని అంటున్నారు. ఇదంతా ముందుగా నిర్ణయించిన కార్యక్రమం అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నా భారత్ కి గర్వకారణం అయిన ఒక ప్రపంచ స్థాయి సదస్సు ఢిల్లీలో జరుగుతున్న వేళ రాహుల్ లేకపోవడం విశేషమే అని అంటున్నారు.

అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సహా వివిధ దేశాల నుంచి అగ్ర నాయకులు అంతా దేశానికి వస్తున్న వేళ రాహుల్ విదేశంలో ఉండడం మీద కూడా చర్చ సాగుతోంది. అయితే ప్రతిపక్షానికి ఇందులో ఎంతవరకూ భాగస్వామ్యం ఉంటుందో లేదో తెలియదు. రాష్ట్రపతి జీ 20 ప్రతినిధులకు ఇచ్చే విందులో ప్రతిపక్షాన్ని కూడా పిలవవచ్చేమో.

ఏది ఏమైనా రాహుల్ గాంధీ కీలకమైన సమయంలో దేశంలో ఉండకుండా విదేశాలకు వెళ్లడం మాత్రం అంటున్నారు. మరో వైపు జీ 20 సదస్సుని ముంగిట్లో పెట్టుకుని ప్రధాని మరో విదేశీ టూర్ పెట్టుకున్నారు. అయితే ఆయన ఈ నెల 8న తిరిగి దేశానికి వస్తారు. ఇక రాహుల్ గాంధీ విదేశాలలో ఏమి మాట్లాడుతారు అన్న దాని మీద కూడా ఆసక్తి కనిపిస్తోంది.

ఆయన గతంలో బీజేపీ ప్రభుత్వం మీద విదేశీ గడ్డ మీద నుంచి విమర్శలు ఘాటైనవి చేసి వేడి పెంచేశారు.ఇపుడు ప్రపంచ దేశాలన్నీ భారత్ కి వచ్చి అత్యున్నత స్థాయి మీటింగ్ జరుగుతుంటే రాహుల్ బీజేపీ విధానాల మీద ఐరోపా పర్యటనలో విమర్శలు చేస్తే మాత్రం అది బీజేపీకి ఇబ్బందిగా మారుతుంది అంటున్నారు.