పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికే రాహుల్ గాంధీ మొగ్గు?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కసరత్తులు చేస్తోంది
By: Tupaki Desk | 11 Dec 2023 10:22 AM GMTతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దీంతో పాటు ఆరోగ్య శ్రీ సేవలకు రూ. 10 లక్షల వరకు ఖర్చు చేసే ఫైల్ పై కూడా సంతకం చేసింది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల కల్పనకు చర్యలు తీసుకుంటోంది. ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని నిర్ణయించింది. దీని కోసం ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదనే ఉద్దేశంతో ముందుకు వెళ్తోంది.
దక్షిణాదిలో కర్ణాటకతో పాటు తెలంగాణలో అధికారం దక్కడంతో కాంగ్రెస్ లో జోష్ పెరుగుతోంది. అధిష్టానం చూపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పడుతోంది. పీసీసీ అధ్యక్షుడి స్థానం ఖాళీ అయినందున ఎవరికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలనే దానిపై రాహుల్ గాంధీ తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. సమర్థుడైన నేతను ఎన్నుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినట్లే లోక్ సభ ఎన్నికల్లో కూడా నెగ్గాలనే ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో సైతం బీజేపీ, బీఆర్ఎస్ లను కోలుకోకుండా చేయాలనే దిశగా మార్పులు చేసుకోవాలని భావిస్తోంది. దీని కోసం కసరత్తులు చేస్తోంది. తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది. రేవంత్ ఆధ్వర్యంలోనే ముందుకు వెళ్లాలని ఆలోచిస్తోంది.
లోక్ సభ ఎన్నికల వరకు రేవంత్ రెడ్డినే పీసీసీ సారధిగా కొనసాగించాలని అధిష్టానం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆయన సారధ్యంలోనే ఎన్నికలకు వెళ్లాలని సూచనప్రాయంగా నిర్ణయించింది. మరోవైపు పీసీసీ రేసులో పలువురు కాంగ్రెస్ సీనియర్లు ఫోకస్ పెట్టారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నిస్తున్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం తోపాటు పీసీసీ చీఫ్ గా ఉండటంతో అందే సంప్రదాయాన్ని ఇక్కడ కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి సారధ్యానికే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ వచ్చే సీట్లపై రేవంత్ రెడ్డి సమర్థత ఆధారపడి ఉందని చెబుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇది అగ్నిపరీక్ష అని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వారి పంతం నెరవేరింది కానీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఎదిరించడం అంత సులువు కాదనే వాదనలు కూడా వస్తున్నాయి.