బాగా సంపాయించుకున్నోళ్లు బయటకు రావాల్సిందే: రాహుల్ ఫైర్
పార్టీని అడ్డం పెట్టుకుని సంపాయించుకున్నవారంతా ఇప్పుడు బయటకు రావాల్సిందే. వారంతా పార్టీ కోసం ఖర్చు చేయాల్సిందే
By: Tupaki Desk | 28 Dec 2023 4:09 AM GMTఏపీ ఎన్నికలకు సంబంధించి తాజాగా డిల్లీలో జరిగిన ఏఐసీసీ కీలక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఆయన సూచించారు. ఇదే సమయంలో బాగా సంపాయించుకున్న వారు ఎవరో.. తనకు తెలుసునని, వారం ఇప్పుడు ఏమయ్యారని వ్యాఖ్యానించారు."పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీకి చెందిన అనేక మంది నాయకులు బాగానే సంపాయించుకున్నారు. ఈ వివరాలు మా దగ్గర ఉన్నాయి" అని రాహుల్ చెప్పారు. అంతేకాదు.. వీరంతా ఇప్పుడు దాక్కుంటామంటే కుదరదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
"పార్టీని అడ్డం పెట్టుకుని సంపాయించుకున్నవారంతా ఇప్పుడు బయటకు రావాల్సిందే. వారంతా పార్టీ కోసం ఖర్చు చేయాల్సిందే. ఈ దిశగా ఖర్గే సాబ్ ఆలోచన చేయండి. ఆదేశాలు ఇవ్వండి. మిగిలింది నేను చూసుకుంటా" అని రాహుల్ వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది. తాజాగా ఏపీ వ్యవహారాలపై ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాత నేతల వ్యవహారం చర్చకు వచ్చింది. ఇప్పుడు వారంతా ఏయే పార్టీల్లో ఉన్నారని రాహుల్ ఆరా తీశారు. పార్టీలు మారకుండా ఉన్నవారివివరాలు కూడా తెలుసుకున్నారు. ఈ సమయంలో పార్టీలు మారకుండా ఉన్నవారిని యాక్టివేట్ చేయాలని.. పార్టీలోకి తిరిగా ఆహ్వానించాలని సూచించారు.
అదేసమయంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంపాయించుకున్నవారంతా సొమ్ములు ఇప్పుడు ఖర్చు పెట్టాలని రాహుల్ పిలుపునిచ్చారు. వైసీపీలో ఉన్న బలమైన నాయకులను కూడా పిలవాలన్నారు. ఏపీలో కేంద్ర మాజీ మంత్రులుగా చేసినవా రు, రాష్ట్ర మంత్రులుగా చేసిన వారు ఇప్పుడు బయటకు రావాలని సూచించారు. వారంతా తిరిగి పార్టీ రుణం తీర్చుకోవాలన్నా రు. లేకపోతే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని రాహుల్ హెచ్చరించారు. పార్టీ పరంగా సంపాయించుకుని బలంగా ఎదిగిన ఇద్దరు కీలక నాయకుల(కావూరి సాంబశివరావు, ఏలూరి సాంబశివరావు) ప్రస్తావన వచ్చింది. వీరిని కూడా పార్టీలోకి తీసుకోవాలని సూచించారు.