Begin typing your search above and press return to search.

వైఎస్సార్‌ పై రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు

By:  Tupaki Desk   |   11 May 2024 10:16 AM GMT
వైఎస్సార్‌ పై రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు!
X

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి రాజీవ్‌ గాంధీకి వైఎస్సార్‌ సోదరుడు లాంటివారని వెల్లడించారు. రాజీవ్, వైఎస్సార్‌ ఇద్దరూ సొంత అన్నదమ్ముల్లా మెలిగేవారని గుర్తు చేశారు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ ఆలోచనలను వైఎస్సార్‌ ప్రతిధ్వనింపజేసేవారని రాహుల్‌ గాంధీ వెల్లడించారు. వైఎస్సార్‌ సిద్ధాంతమే కాంగ్రెస్‌ సిద్ధాంతమని తెలిపారు.

పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు మద్దతుగా రాహుల్‌ గాంధీ కడపకు వచ్చారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ ను సందర్శించిన రాహుల్‌ అక్కడ వైఎస్సార్‌ సమాధికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత కడపలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైఎస్సార్‌ ఏపీకే కాదు.. దేశం మొత్తానికే దారి చూపించారని రాహుల్‌ గాంధీ కొనియాడారు. తాను చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు ౖవైఎస్సార్‌ పాదయాత్రే స్ఫూర్తి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రల ద్వారానే ప్రజల సమస్యలు తెలుస్తాయని వైఎస్సారే తనకు చెప్పారని రాహుల్‌ గాంధీ గుర్తు చేసుకున్నారు. భారతదేశం మొత్తం యాత్ర చేపట్టాలని వైఎస్సారే తనకు చెప్పారన్నారు. తనకు తండ్రిలా ఆయన మార్గనిర్దేశం చేశారని గుర్తు చేసుకున్నారు.

వైఎస్సార్‌ ఎప్పుడూ బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరించేవారని గుర్తు చేశారు. జగన్‌ మాత్రం బీజేపీని పల్లెత్తు మాట కూడా అనట్లేదని మండిపడ్డారు. జగన్‌ పై ఉన్న అవినీతి కేసులే ఇందుకు కారణమని ఆరోపించారు.

సీబీఐ ఛార్జిషీట్‌ లో వైఎస్సార్‌ పేరును కాంగ్రెస్‌ పార్టీ చేర్చలేదని తేల్చిచెప్పారు. ఎవరో వారి స్వలాభం కోసం చేసిన పని ఇదని రాహుల్‌ స్పష్టం చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ను విభజించినప్పుడు యూపీయే ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చిందని గుర్తు చేశారు. ప్రత్యేకహోదా, పోలవరం, కడప స్టీల్‌ ప్లాంట్‌.. ఇలా ఎన్నో హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటే ఇవన్నీ నెరవేరేవని తెలిపారు.

ఈ ఎన్నికల్లో కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే హామీలన్నింటిని నెరవేరుస్తామని చెప్పారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌ కు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని తెలిపారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దేశమంతా కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామన్నారు. యువతకు రెండున్నర లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. పేదలకు రూ.5 లక్షలతో ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. మహిళల ఖాతాల్లో ప్రతి నెలా రూ.8,500 జమ చేస్తామని తెలిపారు.

వైఎస్సార్‌ విలువలు, సిద్ధాంతాలు పార్లమెంటులో వినపడాలంటే తన సోదరి వైఎస్‌ షర్మిలను కడప ఎంపీగా గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆమెను గెలిపిస్తామని ప్రజలు తనకు మాటివ్వాలని రాహుల్‌ కోరారు.

ప్రధాని మోదీ కొందరినే కోటీశ్వరులను చేశారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. మోదీ కొందరికి లక్షల కోట్ల రూపాయలు మేలు చేస్తే దాన్ని అభివృద్ధి అంటున్నారని రాహుల్‌ మండిపడ్డారు. తాము లక్షల మందిని కోటీశ్వరులను చేస్తామని హామీ ఇచ్చారు.