కడప గడ్డ మీద రాహుల్ చెప్పేదేంటి..!?
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఏపీలో ఒకే ఒక ఎన్నికల మీటింగ్ చేస్తున్నారు. అది కడప గడ్డ.
By: Tupaki Desk | 10 May 2024 10:38 AM GMTకాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఏపీలో ఒకే ఒక ఎన్నికల మీటింగ్ చేస్తున్నారు. అది కడప గడ్డ. ఆయన దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఎక్కువ సమయం పొరుగు తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణాకు కేటాయిస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఆశలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన విజయం సాధించింది. అదే ఊపు ఈసారి ఎంపీ ఎన్నికల్లోనూ కంటిన్యూ అవుతుంది అన్న ధీమా అయితే కాంగ్రెస్ లో ఉంది. ఇప్పటిదాకా ఉన్న అంచనాలు అలాగే ఉన్నాయి. ఈ నేపధ్యంలో రాహుల్ గాంధీ అనేక సార్లు తెలంగాణా వచ్చి వెళ్తున్నారు.
అయితే ఏపీ మీద మాత్రం కాంగ్రెస్ పెద్దలు ఫోకస్ పెట్టడం లేదు అని అంటున్నారు. చివరి నిముషంలో కాంగ్రెస్ జాతీయ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఏపీకి వస్తున్నారు. ఆయనతో పాటు ఈ నెల 11న రాహుల్ గాంధీ వస్తున్నారు. ఆయన కడప ఎంపీ సీటు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్న షర్మిలకు మద్దతుగా ప్రచారం చేపట్టనున్నారు.
అయితే రాహుల్ షర్మిల ఏపీసీసీ చీఫ్ అయిన తరువాత తొలిసారి వస్తున్నారు. ఇక జగన్ సీఎం అయ్యాక ఆయన ఏపీకి వచ్చింది కూడా గత అయిదేళ్లలో చాలా తక్కువ. రెండేళ్ళ క్రితం భారత్ జోడో యాత్ర పేరుతో ఆయన దేశమంతా తిరిగినప్పుడు అనంతపురం కర్నూల్ జిల్లా సరిహద్దుల వద్ద పాదయాత్రతో కొంత టచ్ చేశారు.
ఆ తరువాత రాహుల్ ఏపీకి వస్తారు అని ఎంత ప్రచారం జరిగినా ఎందుకో అది సాకారం కాలేదు. ఆయన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో భారీ సభ పెడతారు అని కూడా అంటూ వచ్చారు. అది కూడా జరగలేదు.
ఇక ఎన్నికలు ఏపీలో ముగుస్తున్న వేళ రాహుల్ లాస్ట్ పంచ్ అనుకునేలా ఏపీకి వస్తున్నారు. ఆయన వైఎస్సార్ కుటుంబానికి పట్టున్న కడప గడ్డ మీద నుంచే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనానికి బీజం వేసిన తొలి గడ్డ అది. 2011 మేలో జరిగిన ఉప ఎన్నికల్లో కడప ఎంపీ సీటు నుంచి వైసీపీ తరఫున తొలిసారి పోటీ చేసిన వైఎస్ జగన్ ని ఏకంగా అయిదున్నర లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపించిన కడప గడ్డ అప్పటి నుంచే కాంగ్రెస్ ని అలా అనాధగా వదిలేసింది.
అది లగాయితూ ఎన్ని ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కి డిపాజిట్లు రావడం లేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు అదే వైఎస్సార్ కుటుంబం నుంచి వైయస్సార్ కుమార్తె షర్మిల కాంగ్రెస్ పగ్గాలు అందుకుని కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దాంతో కొంత చర్చకు అయితే ఆస్కారం ఏర్పడింది. అయితే ఆమె గెలుస్తుందా అన్నది కూడా పెద్ద ప్రశ్నగానే ఉంది.
కానీ టీడీపీ నుంచి లోపాయికారీ సహకారం లభిస్తోందని అలాగే కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల ఫోకస్ కూడా కడప సీటుగానే ఉందని అంటూ వచ్చారు. ఇపుడు దానిని నిజం చేసేలా రాహుల్ గాంధీ కడపకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన దివంగత వైఎస్సార్ గురించి ఏమి చెబుతారు. అలాగే ఏపీలో పాలన సాగిస్తున్న జగన్ మీద ఏ రకమైన విమర్శలు చేస్తారు అన్నది పూర్తిగా ఆసక్తిని పెంచుతున్న విషయం.
మరో వైపు చూస్తే కడపలో మాజీ మంత్రి దివంగత నేత వివేకానందరెడ్డి దారుణ హత్య జరిగింది. దాని మీద ఏమైనా రాహుల్ మాట్లాడుతారా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఇక షర్మిల గురించి ఆయన ఏమి చెబుతారు. జగన్ మీద చేసే ఘాటు విమర్శలు ఎలా ఉంటాయి. కడపకు కాంగ్రెస్ కి ఉన్న అవినాభావ సంబంధాల గురించి రాహుల్ వివరించే ప్రయత్నం చేస్తారా అన్నది కూడా మరో చర్చ.
అలాగే వైఎస్సార్ విషయంలో కాంగ్రెస్ ఏమి చేసింది ఆయనను ఎలా గౌరవించింది అని చెప్పి కడప వాసుల మన్ననలు అందుకుంటారా ఇవన్నీ ప్రశ్నలు. మొత్తానికి కడప ఎంపీగా తాను గెలిచి తీరుతాను అని ధీమా వ్యక్తం చేస్తున్న షర్మిలకు మద్దతుగా రాహుల్ రావడం, టీడీపీ ఒక జూనియర్ లీడర్ కి ఎంపీ టికెట్ ఇవ్వడం, వైసీపీలో కొంత చీలిక తెచ్చి అయినా గెలవాలని షర్మిల పట్టుదలగా ఉండడం ఇవన్నీ చూస్తూంటే రాహుల్ కడప పర్యటన వీటికి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.