తెలంగాణ సీఎం పీఠంపై కాంగ్రెస్.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ మొదటి వారం లేదా రెండో వారం విడుదలయ్యే అవకాశం ఉందన్న వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న సమయంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.
By: Tupaki Desk | 24 Sept 2023 5:51 PM ISTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ మొదటి వారం లేదా రెండో వారం విడుదలయ్యే అవకాశం ఉందన్న వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న సమయంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ తమదే తిరిగి తెలంగాణ సీఎం పీఠం అని ధీమాగా ఉండగా... ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం ఈ చాన్స్ కోసం చెమటోడుస్తున్నాయి. అయితే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో తమ అభ్యర్థులను ప్రకటించేశారు. అనంతరం తెరమీదకు వచ్చిన అసంతృప్తులను పరిష్కరించి, త్వరలో పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాల్లో బరిలో ఉండే వారి పేర్లను వెల్లడించే పని పూర్తి చేస్తున్నారు. ఇక మరో ప్రధాన పార్టీ అయిన బీజేపీ సైతం తమ కసరత్తు మొదలుపెట్టి ఇప్పటికే అర్హులు, ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. కాంగ్రెస్ పార్టీ సైతం అభ్యర్థుల ప్రకటనపై సమీకరణాలు అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ఈ సమయంలో రాహుల్ గాంధీ తెలంగాణ ఎన్నికలపై ఆసక్తికర కామెంట్లు చేశారు.
తాజాగా మీడియాతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో విజయం సాధించదనే విమర్శల్ని ఆయన కొట్టి పారేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని రాహుల్ తెలిపారు. తెలంగాణలో బహుషా గెలవవచ్చని, రాష్ట్రంలో బీజేపీ పతనమైందని ఆయన అన్నారు. దీంతో తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే విషయం స్పష్టం అవడమే కాకుండా ఆ పార్టీకి రోడ్ మ్యాప్ కూడా ఉందని రాహుల్ వ్యాఖ్యలను విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఇదిలాఉండగా, తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన మరికొన్ని రోజులు వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. వివిధ పార్టీలకు చెందిన నేతల చేరికలు పూర్తి అయిన తర్వాత ఈ పేర్లు ప్రకటించనున్నట్లు చెప్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో ఒకే సారి 119 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లు గాంధీభవన్ వర్గాలలో చర్చ జరుగుతోంది.