Begin typing your search above and press return to search.

రాహుల్‌.. 66 రోజులు.. 6,713 కిలోమీటర్లు!

లోక్‌ సభ ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో కాంగ్రెస్‌ పార్టీ జోరు పెంచింది

By:  Tupaki Desk   |   5 Jan 2024 5:34 AM GMT
రాహుల్‌.. 66 రోజులు.. 6,713 కిలోమీటర్లు!
X

లోక్‌ సభ ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో కాంగ్రెస్‌ పార్టీ జోరు పెంచింది. అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా అగ్ర నేత రాహుల్‌ గాంధీ మరోసారి భారీ యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే ఆయన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు భారత్‌ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దక్షిణ భారతదేశంతో మొదలుపెట్టి ఉత్తర భారతదేశం వరకు యాత్ర చేశారు. అలాగే ఈసారి తూర్పు భారత్‌ నుంచి పశ్చిమ భారత్‌ వరకు యాత్ర చేయనున్నారు. ఈశాన్య భారత్‌ లోని మణిపూర్‌ నుంచి యాత్రను మొదలుపెట్టి పశ్చిమ భారత్‌ లోని మహారాష్ట్ర వరకు యాత్ర చేయనున్నారు. దీనికి 'భారత్‌ జోడో న్యాయ యాత్ర' అని పేరు పెట్టారు.

ఈ మేరకు ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు సమావేశమై పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. రాహుల్‌ గాంధీ యాత్ర వివరాలను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ వివరించారు. రాహుల్‌ గాంధీ రూట్‌ మ్యాప్‌ ను విడుదల చేశారు. అలాగే వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం మేనిఫెస్టో తయారీ కసరత్తు, సీట్ల సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు.

జనవరి 14 నుంచి మార్చి 20వ తేదీ వరకు రాహుల్‌ గాంధీ 'భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర' చేపట్టనున్నారు. పార్టీ నేతలందరూ ఏకగ్రీవంగా ఈ పేరును నిర్ణయించారు. అలాగే ఈ యాత్రలో ఇండియా కూటమిలోని నేతలందరినీ భాగస్వాములయ్యేలా చేయాలని నిర్ణయించారు.

యాత్రలో భాగంగా రాహుల్‌ గాంధీ మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబయి వరకు 66 రోజుల యాత్ర చేస్తారు. మొత్తం 6,713 కిలోమీటర్ల మేర ఈ యాత్ర ఉంటుంది. దాదాపు యాత్ర అంతా బస్సులోనే సాగుతుంది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం రాహుల్‌ గాంధీ నడుస్తారు.

రాజ్యాంగ పీఠికలో చేర్చిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం కాంగ్రెస్‌ పార్టీ ఏం చేయబోయేదీ రాహుల్‌ గాంధీ ఈ యాత్ర ద్వారా ప్రజలకు వివరించనున్నారని ఆ పార్టీ తెలిపింది. జనవరి 14న భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ లో ప్రారంభమవుతుంది. అక్కడ 107 కిలోమీటర్ల యాత్ర ఉంటుంది. ఆ తర్వాత నాగాలాండ్, అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌ గఢ్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర వరకు మొత్తం 15 రాష్ట్రాల గుండా ఈ యాత్ర సుమారు 6,713 కిలోమీటర్ల దూరం కొనసాగుతుంది.

పట్టణ ప్రాంతాల్లో రాహుల్‌ గాంధీ రోజుకు 9–10 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తారు. ఇందులో భాగంగా అక్కడక్కడ బహిరంగ సభలూ ఉంటాయి. వీటికి ఇండియా కూటమి పార్టీలతో పాటు, ఆయా రాష్ట్రాల్లోని ఇతర పార్టీలు, సామాజిక సంస్థలు, పౌర సమాజాలనూ ఆహ్వానిస్తున్నారు. మొత్తం 110 జిల్లాల్లో 100 లోక్‌ సభ, 337 అసెంబ్లీ స్థానాలను ఈ యాత్ర కవర్‌ చేస్తుంది. యాత్రకు సంబంధించి త్వరలో లోగో, నేపథ్య గీతం విడుదల చేస్తారు. జోడో యాత్ర ఎంత ప్రభావం చూపిందో భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర కూడా అంతే ప్రభావం చూపుతుందని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది.