Begin typing your search above and press return to search.

మణిపూర్ లో దేశం హత్య.. రాహుల్ విమర్శల నిప్పులు

సూటిగా.. గునపంలా అవిశ్వాస తీర్మానంపై ప్రసంగంలో రాహుల్ నిప్పులు చెరిగారు.

By:  Tupaki Desk   |   9 Aug 2023 9:20 AM GMT
మణిపూర్ లో దేశం హత్య.. రాహుల్ విమర్శల నిప్పులు
X

నాలుగు నెలల నుంచి తీవ్ర చర్చనీయాంశమై.. దాదాపు నెల రోజులుగా దేశాన్ని కుదిపేస్తోంది మణిపూర్ అంశం. మైతేయీ-కుకీ వర్గాల ఘర్షణలు.. హత్యలు.. హత్యాచారాలు.. ఆందోళనలు.. నిరసనలు.. ఇలా అట్టుడుకుతోంది మణిపూర్. ఈలోగా కొత్త పార్లమెంటు భవనంలో వర్షాకాల సమావేశాలు రానే వచ్చాయి. దీనికిముందే ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడడం, పార్లమెంటు సమావేశాలకు ముందు రోజే మణిపూర్ లో మహిళలపై జరిగిన దారుణాలు వెలుగులోకి రావడం మరింత నిప్పు రాజేసింది.

ఇదే సమయంలో మణిపూర్ పై పార్లమెంటులో చర్చ జరగాలని.. ప్రధాని మోదీ సమాధానం ఇవ్వాలని "ఇండియా" కూటమి పట్టుబడుతోంది. మోదీ ఎలాగూ నోరిప్పరని తెలిసి ఏకంగా అవిశ్వాస తీర్మానాన్నే అస్త్రంగా ఎంచుకున్నాయి. దీనిపై మంగళవారం చర్చ ప్రారంభమైంది. అనూహ్యంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ కావడం ప్రతిపక్షాలకు కలిసొచ్చింది. కాగా, మంగళవారం అవిశ్వాసంపై చర్చలో కాంగ్రెస్ నేత గొగొయ్ పాల్గొనగా బుధవారం రాహుల్ గాంధీనే మాట్లాడుతున్నారు.

సూటిగా.. గునపంలా అవిశ్వాస తీర్మానంపై ప్రసంగంలో రాహుల్ నిప్పులు చెరిగారు. "మణిపూర్ లో దేశాన్ని హత్య చేశారు" అంటూ కేవలం ఒకే ఒక విమర్శ ద్వారా అక్కడి పరిస్థితిని కళ్లకు కట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆవేశంగా ప్రసంగించారు.

నేను వెళ్లాను.. మరి ప్రధాని వెళ్లరా..?తాను మణిపూర్ లో పర్యటించిన విషయాన్ని రాహుల్ తన ప్రసంగంలో తెలిపారు. ప్రధాని మోదీ సందర్శించని విషయాన్ని ప్రస్తావించారు. భారత్ లో మణిపూర్ లేదనేది మోదీ భావనా..? ఆ రాష్ట్రం ఏమాత్రం మిగిల్లేదు. దాన్ని రెండు ముక్కలు చేశారు. పునరావాస శిబిరాల్లో మహిళలు, పిల్లలతో మాట్లాడాను. ఏమైందమ్మా? అని ఓ మహిళను అడిగా.. 'నా ఒక్కగానొక్క బిడ్డను నా ముందే కాల్చి చంపారు. ఓ రాత్రంతా బిడ్డ శవం వద్దే ఉన్నా. తర్వాత భయంతో కట్టుబట్టలతో వెళ్లిపోయా' అని ఆవేదన వ్యక్తం చేసిందని అన్నారు.

'మరో క్యాంపులో సోదరిని ప్రశ్నించగా.. వణుకుతూ స్పృహ కోల్పోయింది. స్పీకర్ గారూ.. వీళ్లు (పాలకులు) మణిపూర్‌లో భారత్‌ (దేశం)ను హత్య చేశారు.. నేను చెప్పినట్లు భారత్‌ ఓ గొంతు.. అది ప్రజల హృదయ స్పందన. దానిని చంపేశారు. అంటే భారత మాతను మీరు మణిపుర్‌ లో హత్య చేశారు. మీరు దేశ ద్రోహులు, దేశ ప్రేమికులు కాదు. అందుకే మీ ప్రధాని మణిపుర్‌ వెళ్లడం లేదు" అంటూ నిప్పులు కక్కారు.

ఓ తల్లి ఇక్కడ.. మరో తల్లి అక్కడ.."నా తల్లి ఒకరు ఇక్కడ (పార్లమెంటు) ఉన్నారు.. మరో తల్లిని మణిపూర్‌ (బాధిత మహిళలను ఉద్దేశించి)లో హత్య చేశారు. సైన్యం ఒక్క రోజులో శాంతి నెలకొల్పగలదు. అయినా అలా చేయడం లేదు. అసలు ప్రధాని దేశం గుండె చప్పుడు వినడం లేదు. ఆయన ఇద్దరి మాటలే వింటారు. ఒకరు అదానీ. రెండు అమిత్ షా. ఇది రావణాసురుడు.. మేఘనాథుడు, కుంభకర్ణుడి మాట వినే తరహా. లంకా రాజ్యాన్ని రావణుడి అహంకారమే దహించి వేసింది. ఇప్పుడు దేశంలో మీరు కిరోసిన్‌ అనే విద్వేషం చల్లుతున్నారు. మొన్న మణిపూర్‌లో.. నేడు హరియాణాలో.." అంటూ రాహుల్ ధ్వజమెత్తారు.