రాహుల్ గాంధీకి రాజీనామా డెడ్ లైన్ ఎప్పటివరకంటే?
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఈ నెల 18 లోపు రాహుల్ తాను గెలిచిన రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
By: Tupaki Desk | 8 Jun 2024 5:00 AM GMTతాజాగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరైన రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. కేరళలోని వయనాడ్ ఎంపీ స్థానానికి, ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుంచి ఆయన బరిలోకి దిగారు. ఈ రెండింటిలోనూ ఆయన విజయాన్ని సాధించారు. దీంతో.. ఇప్పుడు ఆయన ఏ స్థానాన్ని తనతో ఉంచుకుంటారు? ఏ స్థానాన్ని వదలుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఫలితాలు వెల్లడైన తర్వాత రెండు వారాల్లోపు రెండు స్థానాల్లో పోటీ చేసి.. గెలిచిన వారంతా తాము ఏస్థానాన్ని తమతో ఉంచుకుంటామన్న విషయాన్ని స్పీకర్ కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
ఒకవేళ.. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ఆయన తాను ఎన్నికైన రెండుస్థానాల్లోనూ అనర్హత వేటు పడుతుంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఈ నెల 18 లోపు రాహుల్ తాను గెలిచిన రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
కేంద్ర మంత్రిమండలి సిఫార్సుతో ఈ నెల 5న 17వ లోక్ సభను రాష్ట్రపతి ద్రౌపదీ మర్ము రద్దు చేసుకున్నప్పటికీ.. 18వ లోక్ సభకు ప్రొటెం స్పీకర్ ఎన్నిక అయ్యే వరకు ప్రస్తుత స్పీకర్ ఓం బిర్లా కొనసాగుతారు.ఈ కారణంగా రాహుల్ తన నిర్ణయాన్ని 18 లోపు స్పీకర్ కు లేఖ రాస్తే సరిపోతుంది.