కేసీఆర్ కంటే ఫాస్ట్ ... తెలంగాణకు రాహుల్...
తెలంగాణలో గత కొద్దికాలంగా బలపడుతున్న కాంగ్రెస్ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
By: Tupaki Desk | 6 Oct 2023 6:00 AM ISTతెలంగాణలో గత కొద్దికాలంగా బలపడుతున్న కాంగ్రెస్ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పటికీ పదేళ్లుగా ఆ నిర్ణయం ఫలితాలను పొందకపోవడం, క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పట్ల వ్యక్తమవుతున్న అభిప్రాయాల నేపథ్యంలో... ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశం, కాంగ్రెస్ విజయభేరి పేరుతో భారీ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణకు రానున్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ వాటి పట్ల ప్రజల స్పందన ఎలా ఉందని ఆరా తీస్తోంది. ఈ కీలక హామీల పట్ల ప్రజల్లో మరింత పాజిటివ్ ఫీలింగ్ కలిగేలా కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈనెల రెండో వారంలో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్న రాహుల్ ఇటు పార్టీ నేతలతో సమావేశాలు అటు బహిరంగ సమావేశాలలో పాల్గొననున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్, బీజేపీల పార్టీలు ఒక్కటేనని విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోవైపు బీఆర్ఎస్ సర్కారుపై సైతం తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వీటికి కొనసాగింపుగా తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడం, వాటి ఫలితాలు ప్రజలకు అందే విషయంలో ఫోకస్ పెట్టేలా రాహుల్ టూర్ ఉండనుందని సమాచారం. గత నెలలో హైదరాబాద్‌లోని తుక్కుగూడలో టీ కాంగ్రెస్ నిర్వహించిన విజయగర్జన భారీ బహిరంగ సభలో సోనియాగాంధీ కలిసి రాహుల్ గాంధీ పాల్గొన్న సమయంలో వచ్చిన పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దీంతో త్వరలో జరగబోయే రాహుల్ పర్యటనకు సైతం తెలంగాణ కాంగ్రెస్ సర్వం సిద్దం చేస్తున్నారు.