Begin typing your search above and press return to search.

రాహుల్ గాంధీ విత్ వరుణ్ గాంధీ : బీజేపీకి కొత్త సందేశమా...?

సంజయ్ విచార్ మంచ్ పేరిట రాజకీయ వేదికను మేనకాగాంధీ పెట్టి ఇందిరాగాంధీ ఉన్న టైం లోనే ప్రత్యర్ధి రాజకీయాలు చేశారు

By:  Tupaki Desk   |   9 Nov 2023 2:30 AM GMT
రాహుల్ గాంధీ  విత్ వరుణ్ గాంధీ : బీజేపీకి కొత్త సందేశమా...?
X

గాంధీల కుటుంబం 1980 దాకా కలిసే ఉండేది. 1980 లో సంజయ్ గాంధీ ప్రమాదంలో మరణించడంతో ఇందిరాగాంధీ జీవించి ఉండగానే కుటుంబం రెండుగా మారింది. సంజయ్ సతీమణి మేనకాగాంధీ వేరు పడ్డారు. ఆ తరువాత సోనియాగాంధీ ఇందిరగాంధీతో కలసి ఉంటూ వచ్చారు.

సంజయ్ విచార్ మంచ్ పేరిట రాజకీయ వేదికను మేనకాగాంధీ పెట్టి ఇందిరాగాంధీ ఉన్న టైం లోనే ప్రత్యర్ధి రాజకీయాలు చేశారు. ఆమె మరణం తరువాత బావ గారు రాజీవ్ గాంధీ ప్రధాని అయినా ఆయన మీద అదే తీరులో సాగారు. రాజీవ్ హత్య తరువాత కూడా తోడికోడళ్ళ మధ్యన సామరస్యం కుదరలేదు.

ఇలా నాలుగు దశాబ్దాల కాలంలో సంజయ్, రాజీవ్ కుటుంబాలు వేరుగా ఉంటూ వచ్చాయి. రాజీవ్ వారసుడిగా రాహుల్ 2004లో ఎంపీ అయితే సంజయ్ మేనకల వారసుడిగా వరుణ్ గాంధీ 2009లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన మూడు సార్లు ఎంపీగా ఉంటూ వస్తున్నారు. అయితే 2019 దాకా అంతా బాగుంది కానీ ఆ తరువాత కేంద్ర పెద్దలతో వరుణ్ గాంధీకు చెడింది.

కరోనా టైం నుంచి అయితే బాహాటంగా మోడీ ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ వస్తున్నారు. ఇక తన సొంత నియోజకవర్గం ఫిలిబిత్ లో జనంలో ఉంటున్నారు. కలియ తిరుగుతున్నారు కానీ బీజేపీ కార్యక్రమాలకు వరుణ్ దూరంగా ఉంటున్నారు. బీజేపీ సైతం ఆయన్ని పక్కన పెట్టేసినట్లే ఉంది.

రెండేళ్ళ క్రితం జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుణ్ గాంధీకి ఏ రకమైన బాధ్యతలు ఇవ్వకుండా సైడ్ చేసేశారు. ఈ నేపధ్యంలో వరుణ్ గాంధీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా అన్న చర్చ వస్తోంది. ఇదిలా ఉంటే అనుకోకుండా ఒక దేవాలయంలో రాహుల్ వరుణ్ ఇద్దరూ తారసపడ్డారు. ఈ ఇద్దరు కలయికకు ఉత్తరాఖండ్ లోని కేదారానాధ్ పవిత్ర దేవాలయం వేదికగా మారింది. ఇద్దరూ ఒకరిని ఒకరు పలకరించుకున్నారు.

రాహుల్ తన తమ్ముడు వరుణ్ మీద అభిమానాన్ని ఆప్యాయతను చూపించారు. అలాగే కుటుంబ సమేతంగా వచ్చిన వరుణ్ తో ముచ్చటించారు. వరుణ్ గాంధీ కుమార్తెని చేరదీసి ముద్దులాడారు. ఈ సన్నివేశం చూసిన వారు అన్న దమ్ములు ఇద్దరూ కలసిపోతున్నారు అని అంటున్నారు.

అంతే కాదు ఎన్నడూ లేని విధంగా ఆప్యాయానురాగాలతో ఇద్దరూ వ్యవహరించడం చూస్తూంటే తొందరలోనే తమ్ముడు వరుణ్ గాంధీ కాంగ్రెస్ లో చేరుతారు అని అంటున్నారు. వరుణ్ రాజకీయ జీవితం కొనసాగాలంటే అంతకు మించిన మార్గం లేదు అని అంటున్నారు.

అయితే ఇన్నాళ్ళూ రాహుల్ గాంధీ ఎలా రియాక్ట్ అవుతారు అన్న సందేహాలు ఉండేవి. అయితే తన చిన్నాన్న కుమారుడు తన తమ్ముడు అయిన రాహుల్ ని ఆదరించడం ద్వారా రాహుల్ అన్నగా మిన్నగా నిలిచారు అని అంటున్నారు. రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ దేశానికి నాయకత్వం వహించాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి రావడం చాలా ముఖ్యం.

మూడు సార్లూ ఓడితే కనుక శతాధిక వృద్ధ పార్టీకి చిక్కులు వచ్చినట్లే. అందువల్లనే కాంగ్రెస్ ఇండియా కూటమి పేరుతో విపక్షాలను కూడా దగ్గరకు తీసుకుని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇపుడు తమ్ముడు వరుణ్ గాంధీని కూడా రాహుల్ గాంధీ చేరదీయడం ద్వారా అందరి మన్ననలు అందుకుంటున్నారు. తొందరలో ఇద్దరు అన్న దమ్ములూ ఉన్న దమ్ములు చూపిస్తారు అని అంటున్నారు.

యూపీలో కాంగ్రెస్ బలహీనంగా ఉంది. ఇక వరుణ్ గాంధీ కుటుంబానికి సుల్తాన్ పూర్, ఫిల్ భిత్ లలో పట్టు ఉంది. దాంతో వరుణ్ రాకను కాంగ్రెస్ కూడా స్వాగతిస్తుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే తోడి కోడళ్ళు అయిన సోనియా గాంధీ మేనకా గాంధీ దాదాపుగా రిటైర్మెంట్ స్టేజికి వచ్చేశారు.

ఇలా గాంధీల ప్రస్తుత తరంలో చీలిపోయిన రెండు కుటుంబాలు ఒక్కటి అవుతాయని అంటున్నారు. గాంధీలలో రాహుల్ ప్రియాంకలతో పాటు తోడుగా వరుణ్ గాంధీ కూడా నిలిస్తే పార్టీకి బలం నిండుతనం వస్తుందని అంటున్న వారూ ఉన్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.