మోడీ సెంటిమెంట్ ఈ రేంజ్‌లో ఉంటుందని అస్సలు ఊహించలేదా.. రాహుల్ సర్!
సెంటిమెంట్ అంటే.. కేవలం కొన్ని నిమిషాలకో.. కొన్నిగంటలకో పరిమితం అవుతుందని అనుకుంటా రు. అంతేకాదు.. కొందరికే ఇది పరిమితం అవుతుంది.
By: Tupaki Desk | 23 Jan 2024 3:58 AM GMTసెంటిమెంట్ అంటే.. కేవలం కొన్ని నిమిషాలకో.. కొన్నిగంటలకో పరిమితం అవుతుందని అనుకుంటా రు. అంతేకాదు.. కొందరికే ఇది పరిమితం అవుతుంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నవారికి పెద్దగా సెంటిమెంట్లను పట్టించుకునే పరిస్థితి ఉండదు. కానీ, ఇప్పుడు ఈ వాదనలన్నీ కొట్టుకుపోయా యి. కరడు గట్టిన కమ్యూనిస్టుల నోటీ కూడా.. రామ నామం జపించేయగల భారీ సెంటిమెంటునే ప్రధాని నరేంద్ర మోడీ దేశంపై ఒక తారక మంత్రంగా విరజిమ్మారు.
ఇది అలాంటి.. ఇలాంటి సెంటిమెంటు కాదు..! అనే రేంజ్‌లో ప్రధాని మోడీ.. అయోధ్య రామమందిర పునః ప్రతిష్టా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. తాజాగా కేరళ నుంచి తమిళనాడు వరకు.. అటు ఈశాన్య రాష్ట్రాల నుంచి ఉత్తరాది వరకు.. ఎటు చూసినా రామనామ జపమే వినిపిస్తోంది. నిజానికి కేరళలో స్థానికులు మెజారిటీగా వేరే మతాన్ని ఆచరిస్తారు. కానీ, ఇక్కడ కూడా ఇప్పుడు రామనామమే వినిపిస్తోంది. ప్రభుత్వం కూడా వారి డిమాండ్లకు తలొగ్గి.. సెలవు ప్రకటించింది.
ఇక, పక్కా క్రిస్టియానిటీ ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లోనూ రామ భక్తి వెల్లువగా పారుతోంది. ఎంతగా అంటే.. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి సెగ పెట్టేంతగా!! ఆశ్చర్యం అనిపించినా నిజమే. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో ఉన్నారు. ఇది అస్సాంలో సాగుతోంది. అయితే.. ఈయన యాత్ర.. సమీపంలోని ఓ మందిరానికి చేరుకున్నాక.. యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.. ఆలయంలో రాముడిని దర్శించుకుని.. బీజేపీ కార్యకర్తలు చేస్తున్న భజనల్లో పాల్గొన్నారు
అంతేకాదు.. బీజేపీ వారితో కలిసిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు.. జై శ్రీరామ్ అంటూ నినాదాలు అందుకున్నారు. ఈ ఘటన్ రాహుల్‌ను విస్మయానికి గురి చేసింది. తన వారు కూడా మోడీ వలలో పడిపోయారే! అని గుసగుసలాడారు. సో.. ఇదీ.. మోడీ ఈ దేశ ప్రజలపై జల్లిన రాముడిసమ్మోహనాస్త్రం! ఇదిలావుంటే, అయోధ్య రామమందిర కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే.. కేరళకు చెందిన ఇద్దరు కమ్యూనిస్టుకురువృద్ధులు మాత్రం ఆలయానికి వెళ్లనున్నట్టు వెల్లడించారు.