Begin typing your search above and press return to search.

తెలంగాణాలో కాంగ్రెస్ సునామీ ..ఈ జోస్యం ఎవరిది...?

రాహుల్ గాంధీ తెలంగాణాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన పెద్దపల్లి లో జరిగిన సభలో మాట్లాడుతూ తెలంగాణా నాడి తనకు అందిందని చెప్పేసారు.

By:  Tupaki Desk   |   19 Oct 2023 5:08 PM GMT
తెలంగాణాలో కాంగ్రెస్ సునామీ ..ఈ జోస్యం ఎవరిది...?
X

రాజకీయాల్లో తుఫానులు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి సునామీలు వస్తూంటాయి. నూటికి ఎనభై శాతం మంది ప్రజల మద్దతుని తీసుకుని మరీ టోటల్ సీట్లలో అత్యధికాన్ని కొల్లగొడుతూ ఉంటాయి. అలా అనేక సందర్భాలలో జరగడం ఈ దేశానికి ఈ దేశ రాజకీయానికి అలవాటే. మరి ఈ నవంబర్ 30న జరగనున్న తెలంగాణా శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో సునామీ ఉందా. అది నిశ్శబ్దంగా ఉందా.

ఇప్పటికే ఓటరన్న ఫుల్ గా డిసైడ్ అయి ఉన్నాడా. ఒక్కసారి ఈవీఎం మిషన్ దగ్గరకు వెళ్లాలి కానీ గుద్దిపడేయడమే తరువాయిగా ఉందా. మరి అంతటి సునామీ వస్తే అది ఏ పార్టీ వైపు నుంచి వస్తుంది. ఎవరికి అనుకూలంగా ఉంటుంది అంటే కచ్చితంగా కాంగ్రెస్ నుంచే సునామీ వస్తుంది తట్టుకోలేరు అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ.

ఈసారి వచ్చే సునామీ తో తెలంగాణాలో అద్భుతమైన మెజారిటీతో హస్తం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అని ఆయన బల్లగుద్ది చెబుతున్నారు. రాహుల్ గాంధీ తెలంగాణాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన పెద్దపల్లి లో జరిగిన సభలో మాట్లాడుతూ తెలంగాణా నాడి తనకు అందిందని చెప్పేసారు. ఆరు నూరు అయినా వచ్చే ది కాంగ్రెస్ సర్కార్ అని రాహుల్ అంటున్నారు.

మరి రాహుల్ పర్యటనలో రోడ్ పక్కన మీటింగ్స్ కూడా నిర్వహించారు. అదే విధంగా ప్రజలతో కూడా నేరుగా మమేకం అవుతున్నారు. బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీ ఇలా సుడిగాలి పర్యటన చేస్తున్న తెలంగాణాలో జనం ఏమి అనుకుంటున్నారు అన్నది ఆయనకు తెలిసిపోయిందా అన్న చర్చ వస్తోంది. గాలి మార్పు అన్నది రాహుల్ గాంధీకి అర్ధం అయిందా అని కూడా అంటున్నారు

అందుకే ఆయన తుఫాన్ అనడంలేదు ప్రభజనం అని కూడా అనడం లేదు ఏకంగా సునామీ అని అతి పెద్ద మాటే వాడారు. మరి సునామీ అంటే తెలంగాణాలో ఉన్న మొత్తం 119 సీట్లలో వందకు పైగా వస్తే అది కచ్చితంగా సునామీ కిందకే వస్తుంది. అంటే నూటికి తొంబై శాతం సీట్లు అన్న మాట. అలా కాంగ్రెస్ కి పాజిటివ్ వేవ్ ఉందని రాహుల్ అభిప్రాయపడుతున్నారు

ఈ వేవ్ లో అధికార బీయారెస్ సహా బీజేపీ కూడా కొట్టుకుని పోతుందని నిబ్బరంగా చెబుతున్నారు. కాంగ్రెస్ ది తెలంగాణాతో రాజకీయ బంధం కాదని అది కుటుంబ బంధం అనుబంధం అని సరికొత్త నిర్వచనం రాహుల్ ఇస్తున్నారు. రాజకీయ బంధాలు బీయారెస్ కే ఉన్నాయని తమకు ప్రజల తో నేరుగా ఉన్న అనుబంధం అని ఆయన అంటున్నారు. తెలంగాణా ప్రజలు తమ కుటుంబ సభ్యులని వారి ప్రేమానురాగాలు ఎలా ఉంటాయో చూడమని చెప్పేందుకే తన చెల్లెలు ప్రియాంకను కూడా తనతో పాటు ఈసారి పర్యటనకు తీసుకుని వచ్చానని రాహుల్ చెబుతున్నారు.

అంతే కాదు, తమ పార్టీ తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన వెంటనే తాము ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్లుగానే ఆరు గ్యారంటీలను మొదటి కేబినెట్‌లోనే ఆమోదిస్తామని రాహుల్ గట్టిగా చెబుతున్నారు. అలా అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతామని స్పష్టం చేస్తున్నారు

ఇక తెలంగాణాకు అన్నీ మంచి రోజులే అని కేసీఆర్ ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం రాబోతుందని రాహుల్ జోస్యం చెప్పేశారు బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి కాంగ్రెస్‌ను ఓడించాలని చూస్తున్నాయని ఆయన పెద్ద ఆరోపణనే చేశారు. అంటే ఆ మూడు పార్టీలను ఆయన ఒక గాటకు కట్టేశారు అన్న మాట. ఇక ఆయన ఇంకో మాట కూడా అంటున్నారు. పొరపాటున బీజేపీ, ఎంఐఎంకు ఓటు వేస్తే అవి బీఆర్‌ఎస్‌కు వేసినట్లేనని జనాలు ఆలోచించాలని కోరుతున్నారు.

తాను జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాడినందుకు తనపైన అనేక కేసులు పెట్టారని రాహుల్ గుర్తు చేసుకున్నారు. అంతే కాదు, ఏకంగా తన లోక్‌సభ సభ్యత్వం రద్దు చేశారని, తనను ఎలాగైనా దెబ్బ తీయాలని చూసినా తాను గట్టిగా నిలబడ్డానని అదే నిబ్బరంతో తెలంగాణాకు మంచి పాలన అందిస్తామని రాహుల్ చెబుతున్నారు మొత్తానికి చూస్తే గతంలో ఎన్నడూ లేని ధీమా రాహుల్ మాటలలో కనిపిస్తోంది. మరి తెలంగాణాలో కాంగ్రెస్ సునామీ రాబోతోందా. వెయిట్ అండ్ సీ.