Begin typing your search above and press return to search.

షర్మిలకు అండగా రాహుల్ సీన్లోకి వచ్చేశారు

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు తమ అండదండలు పూర్తిగా ఉంటాయన్న విషయాన్ని చాటి చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ నేరుగా సీన్లోకి వచ్చేశారు.

By:  Tupaki Desk   |   4 Feb 2024 11:08 AM IST
షర్మిలకు అండగా రాహుల్ సీన్లోకి వచ్చేశారు
X

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు తమ అండదండలు పూర్తిగా ఉంటాయన్న విషయాన్ని చాటి చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ నేరుగా సీన్లోకి వచ్చేశారు. ఏపీ పీసీసీ రథసారధిగా బాధ్యతలు చేపట్టిన షర్మిల.. ఆ తర్వాత నుంచి ఏపీ సీఎం కం తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీదా.. ఆయన ప్రభుత్వం తీరుపైనా విమర్శలు చేయటం కలకలాన్ని రేపటం తెలిసిందే. రాజకీయ ప్రయోజనాల కోసం అన్న మీద ఇలాంటి మాటలు మాట్లాడటమా? అంటూ వైసీపీ నేతలు.. అభిమానులు షర్మిలపై విరుచుకుపడుతున్నారు.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో షర్మిల మీదా.. వైఎస్ వివేకానంద కుమార్తె డాక్టర్ సునీత మీదా వారు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేయటం కనిపిస్తోంది. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై భారీగా డిబేట్ జరుగుతోంది. ఇలాంటివేళ రాహుల్ సీన్లోకి వచ్చేశారు. షర్మిలకు అండగా నిలిచారు. వైసీపీ అభిమానులు పలువురు సోషల్ మీడియాలో చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డారు.

మహిళల్ని కించపర్చటం అమానుషమన్న రాహుల్.. ఇది పశు ప్రవర్తనేనని మండిపడ్డారు. ఇలాంటి చేష్టలతో కాంగ్రెస్ ఆత్మస్థైరాన్ని దెబ్బ తీయలేరన్న ఆయన.. షర్మిలకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఓటమిని ఎదుర్కోలేని పిరికివాళ్లే క్రూరత్వాన్ని ఆశ్రయిస్తారన్న ఆయన.. సోషల్ మీడియా ద్వారా పోస్టు పెట్టటం గమనార్హం. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని ఏపీ భవన్ లో షర్మిల నిరసన వ్యక్తం చేయటం తెలిసిందే. రాష్ట్ర ప్రజలు తనకు చూపిస్తున్న మద్దతు.. అప్యాయతలే తన బలంగా షర్మిల పేర్కొన్నారు. మొత్తంగా షర్మిలకు అండగా రాహుల్ నేరుగా సీన్లోకి రావటం చూసినప్పుడు.. షర్మిల వెంట కాంగ్రెస్ ఉందన్న సంకేతాల్ని తాజా చర్యతో స్పష్టం చేశారన్న మాట వినిపిస్తోంది.