ఈ పని చేస్తే..రాహుల్ తెలంగాణలో హీరో అవుతాడు
తాజాగా రాహుల్ గాంధీ కూడా మరోసారి అవే విమర్శలు చేశారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ.. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల బృందంతో కలిసి గురువారం మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు వెళ్లనున్నారని తెలుస్తోంది.
By: Tupaki Desk | 1 Nov 2023 5:08 PM GMTకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రత్యేకంగా , ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. కీలకమైన సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణ మొదలుకొని వరుస ఎన్నికల ప్రచారాల వరకు ఆయన స్పెషన్ ఫోకస్ అర్థం చేసుకోవచ్చు. దీనికి కొనసాగింపుగా తెలంగాణలో తన హీరోయిజం చాటుకునే మరో పనికి రాహుల్ స్కెచ్ వేశారని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుని పరిశీలించేందుకు రాహుల్ గాంధీ వెళ్లనున్నట్లు సమాచారం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం గురించి ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకొన్న సంగతి తెలిసిందే. అయితే, దురదృష్టవశాత్తు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ (లక్ష్మీ)బ్యారేజీలోని పిల్లర్లు కుంగిపోవటం బీఆర్ఎస్ ను ఇరుకున పెడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపిస్తోంది. తాజా సంఘటనతో కేసీఆర్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నాయి. తాజాగా రాహుల్ గాంధీ కూడా మరోసారి అవే విమర్శలు చేశారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ.. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల బృందంతో కలిసి గురువారం మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు వెళ్లనున్నారని తెలుస్తోంది.
మేడిగడ్డ బ్యారేజీ ఘటన రాజకీయ ప్రకంపనలు రేపుతున్న నేపథ్యంలో కుంగిన మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్ నేతలతో కలిసి పరిశీలించాలని రాహుల్ గాంధీ నిర్ణయించారని సమాచారం. అయితే, ప్రస్తుతం మేడిగడ్డ ప్రాంతానికి ఎవర్నీ పోలీసులు అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో మేడిగడ్డ ప్రాంతంలో రాహుల్ పర్యటన కొనసాగుతుందా..? లేదా అనేది ఉత్కంఠగా ఉంది. రాహుల్ సహా కాంగ్రెస్ నాయకులను అనుమతిస్తారా..? లేదా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే, మేడిగడ్డకు వెళ్లిన తర్వాతే అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లాలని రాహుల్ నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.