దిగ్భ్రాంతి-పరిహారం.. కేంద్రం చేస్తోందింతే!
అయినప్పటికీ.. ఉదాశీనత, నిర్లక్ష్యం వంటివి సాధారణ ప్రజల ఉసురు తీసే పరిస్థితిని కల్పిస్తున్నాయి.
By: Tupaki Desk | 16 Feb 2025 5:37 AM GMTప్రమాదాలు చెప్పిరావు.. కానీ, కొన్ని ప్రమాదాలను ముందుగానే ఊహించే అవకాశం మెండుగా ఉంది. పైగా.. భారీ వ్యవస్థను చేతిలో ఉంచుకున్న కేంద్రానికి.. ప్రమాదాలను అంచనా వేసే అవకాశం లేదని అనుకోలేం. అయినప్పటికీ.. ఉదాశీనత, నిర్లక్ష్యం వంటివి సాధారణ ప్రజల ఉసురు తీసే పరిస్థితిని కల్పిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు అంటే.. 45 రోజుల్లో దేశవ్యాప్తంగా రైలు ప్రమాదాలు జరిగి.. 130 మందికిపైగా చనిపో యారు. చిత్రం ఏంటంటే.. ఇవేవీ రైల్ దారి మధ్యలో ట్రాక్‌పై జరిగిన ప్రమాదాలు కావు.
నేరుగా స్టేషన్లలోనూ.. రైళ్లు ఆగిన సందర్భాల్లోనూ జరిగిన ప్రమాదాలే. ఇంకా చెప్పాలంటే.. ఉత్తరప్రదే శ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లే వారే ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌లో తెగిపడిన విద్యుత్ వైర్ల కారణంగా ఐదుగురు కుంభమేళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అలహాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీని నియంత్రించ డంలో విఫలమైన కారణంగా.. 12 మంది ఈ ఏడాది మృతి చెందారు.
ఇక, తాజాగా ఢిల్లీ ఘటనలో మరో 18 మంది, మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 80 మందికి పైగా విగత జీవులయ్యారు. ఇవన్నీ.. నియంత్రించదగ్గవే.. అయినా.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. హిందూ ధార్మిక కార్యక్రమాలకు సంబంధించి చేస్తున్న విస్తృత ప్రచారానికి తగిన విధంగా భక్తులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. నిజానికి ఈ కార్యక్రమాలు రాష్ట్రాల పరిధిలో ఉన్నప్పటికీ.. కేంద్రం వేలు పెడుతోంది.
విస్తృత ప్రచారం చేస్తోంది. సెలబ్రిటీలను రంగంలోకి దించి మరీ మరింత హైప్ తెస్తోంది. ఫలితంగా పోటెత్తుతున్న భక్తులకు భద్రత కల్పించడంలో అధికారులు .. ప్రభుత్వం కూడా విఫలమవుతున్నాయి. అయితే.. ఇలాంటివి జరుగుతున్నప్పుడు కేంద్రంలోని పెద్దలు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం.. పరిహారం ప్రకటించడం వరకే.. పరిమితం అవుతున్నారు. మహా అయితే.. విచారణకు కమిటీని వేస్తున్నట్టు ప్రకటించి చేతులు దులుపుకొంటున్నారు. ఇంతకుమించి.. చేస్తున్నది ఏమీ లేకపోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.